శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నాలుగేళ్లకోసారి భార్యలను మారుస్తారంటూ ధ్వజమెత్తారు. కార్లను మార్చినట్టు భార్యలను మార్చే పవన్ కళ్యాణ్ తనను విమర్శిస్తున్నాడంటూ నిప్పులు చెరిగారు జగన్. 

శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న జగన్ రాజాంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు పార్టనర్ అంటూ ఆరోపించారు. 
 

2014 నుంచి 18 వరకు చంద్రబాబుతో కలిసి కాపురం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సరికొత్త రాగం ఎత్తుకున్నాడంటూ విమర్శించారు. నాలుగున్నరేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు చేసిన అవినీతిలోనూ, మోసంలోనూ, తప్పుడు నిర్ణయాల్లోనూ, అరాచక పాలనలోనూ పవన్ కు భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. నాలుగేళ్లు చంద్రబాబుతో సంసారం చేసి ఇప్పుడు విడిపోయినట్లుగా నటిస్తూ మ్యాచ్ ఫిక్సింగ్ లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. 

చంద్రబాబు స్క్రిప్ట్ రాసి డైరెక్షన్ చేస్తే పవన్ కళ్యాణ్ యాక్షన్ చేస్తున్నాడంటూ మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సినిమాకు లింగమనేనని నిర్మాత అంటూ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సినిమాకు ఇంటర్వేల్ ఎక్కువ సినిమా తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు పేమెంట్లు చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ కాల్షీట్లు ఇస్తాడంటూ దుమ్మెత్తి పోశారు. 

చంద్రబాబు చేస్తున్న అరాచకపాలనపై, అధర్మంపై పోరాటం చేసేది కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు. అలాంటి అధర్మ పాలనపై మాట్లాడని పవన్ కళ్యాణ్ తనపై మాత్రం విమర్శలు చేస్తాడని దుయ్యబుట్టాడు. 

జగన్ అవినీతి పరుడు అంటున్న పవన్ నువ్వు చూశావా నా అవినీతి అంటూ ప్రశ్నించారు. పవన్ రాజకీయాల్లోకి రాకముందే తన తండ్రి రాజశేఖర్ రెడ్డి పాలన జరిగిందన్నారు. అలాంటిది వైఎస్ పై కూడా మాట్లాడతాడంటూ విమర్శించారు.