పోలవరంపై భవిష్యత్తులో విచారణ తప్పదు

పోలవరంపై భవిష్యత్తులో విచారణ తప్పదు

పోలవరం అవినీతిపై భవిష్యత్తులో కచ్చితంగా విచారణ జరుగుతుందని వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అనంతపురం జిల్లాలో బుధవారం పాదయాత్ర ముగుస్తోంది. ఆ సందర్భంగా జగన్ మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అందుకే కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని మండిపడ్డారు.

కాంట్రాక్టులు సబ్‌ కాంట్రాక్టుల పేరుతో టీడీపీ నేతలు దోచుకుంటున్నారని వైఎస్‌ జగన్‌ విమర్శించారు. ప్రాజెక్టులకు సంబంధించి ఇబ్బడిముబ్బడిగా అంచనాలు పెంచుతున్నారంటూ మండిపడ్డారు.  అవినీతిపరులు, అక్రమార్కులకు చంద్రబాబు అండగా నిలిచారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని, వైఎస్సార్‌ హయాంలో 90శాతం పూర్తైన ప్రాజెక్టుల గేట్లు తెరిచి.. తానే కట్టానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని వైఎస్‌ జగన్‌ విమర్శించారు.

ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. 'నేను చంద్రబాబులా కాకుండా నిబద్ధతతో పనిచేస్తా. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా' అని జగన్ హామీ ఇచ్చారు. 'మేం ఏం చేయబోయేది ముందుగానే ప్రకటిస్తాం. మా మ్యానిఫెస్టోను ఇంటర్నెట్‌లో పెడతాం. మేం ఇచ్చిన మాటకు కట్టుబడకపోతే ఎవరైనా మమ్మల్ని ప్రశ్నించవచ్చు' అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో కులాలు, మతాలు, పార్టీలను చూడబోమని, అర్హులందరికీ న్యాయం చేస్తామని అన్నారు. మేం విలువలతో కూడిన రాజకీయం చేస్తామని స్పష్టం చేశారు.

గ్రామీణ మహిళల కష్టాలు తెలియనివారే పెన్షన్లపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ధర్మవరంలో చేనేత మహిళల కష్టాలు చూశాకే.. 45 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తానని హామీ ఇచ్చినట్టు చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే 'వైఎస్‌ఆర్‌ చేయుత' పథకం కింద నెలకు రూ. 2వేల పెన్షన్‌ ఇస్తానని తెలిపారు. దశలవారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పారు. రైతులకు ఏటా రూ. 12,500 మే నెలలోనే చెల్లిస్తామని అన్నారు. పంటలకు ముందే గిట్టుబాటు ధర ప్రకటించి కొనుగోలు చేస్తామని తెలిపారు. ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళలకు ఎంత రుణం ఉంటే అంతా నాలుగు విడతల్లో చెల్లిస్తామని చెప్పారు. ప్రతి జర్నలిస్ట్‌కు కచ్చితంగా ఇళ్లస్థలం ఇస్తామని కూడా హామీ ఇచ్చారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page