జీరోకు వెళ్లదు: కరోనాపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
కరోనా వైరస్ వ్యాధిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ ఏనాడు కూడా జీరో స్థాయికి వెళ్లదని ఆయన అన్నారు. మాస్కులు, శానిటైజర్లు జీవితంలో భాగం కావాలని అన్నారు.
అమరావతి: కరోనా వైరస్ మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ జీరో స్థాయికి వెళ్తుందని అనుకోవద్దని ఆయన వ్యాఖ్యానించారు. స్పందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాస్కులు, శానిటైజర్లు క్రమం తప్పకుండా వాడాలని, అవి మన జీవితంలో భాగం కావాలని ఆయన అన్నారు.
గ్రామాల్లో ప్రతివారం ఫీవర్ సర్వేలు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇష్టానుసారం కాకుండా లక్షణాలు ఉన్నవారికే కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ధర్డ్ వేవ్ వస్తుందో, రాదో తెలియదని, అయితే, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. పిల్లలకు చికిత్స అందించడంపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.
పిల్లల కోసం ప్రత్యేకంగా అత్యాధునిక వైద్యాన్ని అందుబాటులోకి తెస్తున్నామని, అందుకు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ప్రత్యేకంగా పిల్లల కోసం ఏర్పాటు చేస్తున్నామని, వాటి స్థాపనకు కలెక్టర్లు భూములను గుర్తించాలని ఆయన అన్నారు.
కరోనా చికిత్స విషయంలో పేదవాడిపై ఆర్థిక భారం పడకుండా చూడాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిర్ణయించిన ధరలకే చికిత్స అందేలా చూడాలని, దాన్ని ఉల్లంఘించే ఆస్పత్రులపై కఠినంగా వ్యవహరించాలని, ఉల్లంఘన చేస్తే మొదటిసారి పెనాల్టీ వేసి, రెండోసారి కూడా ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన ఆదేశించారు
వాక్సినేషన్ కెపాసిటీ పెంచాల్సిందేనని ఆయన అన్నారు. వాక్సినేషన్ విషయంలో మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని అన్నారు. వాక్సినేషన్ విషయంలో విధివిధానాలను అనుసరించాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో విధించిన కర్ఫ్యూ, అనుసరించిన వ్యూహం మంచి ఫలితాలను ఇచ్చిందని జగన్ చెప్పారు. సడలింపులు ఇస్తూ కర్ఫ్యూను కొనసాగించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.