అమరావతి: టీడీపీ నుండి తమ పార్టీలో ఎవరినైనా చేర్చుకొంటే... టీడీపీ ద్వారా పొందిన పదవులకు రాజీనామాలు చేసిన తర్వాతే తమ పార్టీలో చేర్చుకొంటామని ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఒకవేళ పార్టీ  మారకుండా  చేర్చుకొంటే అనర్హత వేటేయాలని  ఏపీ సీఎం జగన్ తేల్చి చెప్పారు.

గురువారం నాడు ఏపీ స్పీకర్‌గా ‌తమ్మినేని సీతారాం ఎన్నికైన తర్వాత ‌ ఆయనను అభినందిస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. ఏపీ అసెంబ్లీలో టీడీపీకి ఈ దఫా 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే దక్కాయి, మరో ఐదుగురు ఎమ్మెల్యేలను తమ పార్టీ వైపుకు లాక్కొంటే  చంద్రబాబునాయుడుకు తనకు ఏం తేడా ఉంటుందని  ఆయన ప్రశ్నించారు.
 
టీడీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను లాక్కొంటే  చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడ కోల్పోతారని జగన్ గుర్తు చేశారు. కానీ, తాను అలా చేయనని చెప్పారు. ఒకవేళ టీడీపీ నుండి ఎవరైనా తమ పార్టీలో చేర్చుకొంటే  టీడీపీ ద్వారా లభించిన పదవులకు రాజీనామా చేయించిన తర్వాతే తమ పార్టీలో చేర్చుకొంటామని జగన్ చెప్పారు.

 గత టర్మ్‌లో 67 మంది తమ పార్టీ ద్వారా విజయం సాధిస్తే  వారిలో  23 మందిని టీడీపీలో చేర్చుకొన్నారని జగన్ గుర్తు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అధికార బెంచీల్లో కూర్చొబెట్టుకొని... నలుగురికి మంత్రి పదవులు కూడ కట్టబెట్టారని జగన్ గుర్తు చేశారు.

ఏపీ స్పీకర్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే దానికి వ్యతిరేకంగా నిబంధనలను కూడ మార్చివేశారని చెప్పారు.ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన వారికి 23 ఎమ్మెల్యే సీట్లు, ఎంపీలను కొనుగోలు చేసిన వారికి మూడు ఎంపీ సీట్లు మాత్రమే వచ్చాయని జగన్ ఎద్దేవా చేశారు.

ఈ ఫలితాలు కూడ 23వ తేదీనే వచ్చాయని ఆయన చెప్పారు.దేవుడు స్క్రిప్టు రాస్తే ఎలా ఉంటుందో ఈ ఫలితాలను చూస్తే అర్ధం అవుతోందన్నారు.పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరినా కూడ పట్టించుకోలేదన్నారు. కానీ, ప్రజలే ఆ పార్టీకి అనర్హత వేటు వేశారని జగన్ ఎద్దేవా  చేశారు.

ప్రతిపక్షనేతను కూడ మాట్లాడని పరిస్థితిని కూడ గత అసెంబ్లీలో చూశామన్నారు జగన్. ఈ శాసనసభలో విలువల్లేని రాజకీయాలను చూసినట్టుగా ఆయన గుర్తు చేశారు. పార్లమెంటరీ సంప్రదాయాల విషయంలో ఈ సభ దేశానికే ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం  అభిప్రాయపడ్డారు.