Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో పిట్టల దొర కథలు చెప్తున్నాడు: బాబుపై జగన్ విసుర్లు

తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిట్టల దొర కథలు చెప్తున్నాడని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గం చిలకలపాలెంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
 

YS Jagan satires on AP CM Chandrababu
Author
Srikakulam, First Published Dec 6, 2018, 5:37 PM IST

శ్రీకాకుళం: తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిట్టల దొర కథలు చెప్తున్నాడని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గం చిలకలపాలెంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుందని అయినా పట్టించుకోకుండా అధికారం కోసం తెలంగాణలో తిష్టవేశాడని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను చిత్తుగా ఓడించాలంటూ చంద్రబాబు నీతులు చెప్తాడని మరి ఆంధ్రప్రదేశ్ లో నువ్వు చేసింది ఏంటి చంద్రబాబు అని ప్రశ్నించారు. 

పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలను నమ్మక ద్రోహులు అని, చరిత్ర హీనులని, వారిని చిత్తుగా ఓడించాలని హైదరాబాద్ లో పిలుపులు ఇస్తున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు చేసింది ఎవరని ప్రశ్నించారు. 

అందులో నలుగురిని మంత్రులుగా చేసి నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చిన చంద్రబాబు తెలంగాణలో నీతిలో చెప్తావా అంటూ మండిపడ్డారు. అంతేకాదు తెలంగాణలో ప్రపంచ రికార్డులు బద్దలగొట్టేలా అబద్దాలు చెప్తున్నారని జగన్ ఆరోపించారు. 

హైదరాబాద్ తానే నిర్మించానని అబద్దాలు చెప్తున్నాడని విమర్శించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ తానే కట్టాడట, ఔటర్ రింగ్ రోడ్ తానే వేశాడట ఇలా ప్రపంచంలో ఏ నాయకుడు ఆడని అబద్దాలు ఆడారని విమర్శించారు. 

ప్రజలకు ఏమీ తెలియదని చంద్రబాబు అబద్దాలు చెప్తున్నారా లేక ప్రజలు ఏమి చెప్పినా నమ్ముతారనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. కానీ ప్రజల చెవ్వుల్లో మాత్రం పువ్వులు పెట్టాలనుకుంటున్నాడని ధ్వజమెత్తారు.  

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ను నిర్మించి ప్రారంభించింది ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. 2005 మార్చిలో శంషాబాద్ విమానాశ్రయం పనులు ప్రారంభించి 2008లో ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించింది వైఎస్ కాదా అంటూ నిలదీశారు. 

2005లో డిసెంబర్ లో ఔటర్ రింగ్ రోడ్డు పనులను ప్రారంభించి ఆయన హయాంలోనే పూర్తి చేసింది వాస్తవం కాదా అన్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఐటీ వరకు ఔటర్ రింగ్ రోడ్డు వెయ్యడం వల్లే ఐటీ రంగం ఉరుకులు పరగులు పెట్టిందని చెప్పుకొచ్చారు. 

చంద్రబాబు నాయుడు హయాంలో ఐటీ రంగం వృద్ధి రేటు 5శాతం ఉంటే అదే వృద్ధిరేటు వైఎస్ హయాంలో 14శాతానికి చేరుకుందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగం 5వ స్థానంలో ఉంటే దాన్ని 3వ స్థానంలోకి తీసుకెళ్లింది రాజశేఖర్ రెడ్డి కాదా అంటూ ప్రశ్నించారు. 

చంద్రబాబు నాయుడు హయాంలో 909 కంపెనీలు ఉంటే వైఎస్ హయాంలో 1500 కంపెనీలు వచ్చాయని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో 85వేల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తుంటే అదే వైఎస్ హయాంలో 2లక్షల 64వేల 754 మంది పనిచేశారని చెప్పారు. 

చంద్రబాబు హయాంలో ఐటీ పెట్టుబడులు 3వేల కోట్ల రూపాయలు అయితే వైఎస్ హయాంలో 13వేల 200కోట్ల రూపాయలు అంటూ చెప్పారు. చంద్రబాబు హయాంలో ఐటీ ఎగుమతులు 5,520 కోట్లు అయితే వైఎస్ హయాంలో 33వేల 482 కోట్లు అని జగన్ గుర్తు చేశారు. ఐటీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభివృద్ధి చేస్తే తానే చేశానని చంద్రబాబు అబద్దాలు చెప్తున్నాడని అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు మెుదటి స్థానం అంటూ విమర్శించారు.  

చంద్రబాబు నాయుడు హయాంలో తెలంగాణకు కానీ ఆంధ్రాకు కానీ మేలులు జరగలేదని అన్యాయమే జరిగిందన్నారు. తెలంగాణలో అల్వీన్ అమ్మేశాడని, నిజాం షుగర్ ప్రాజెక్టు, పాలేరు షుగర్ ప్రాజెక్టుతోపాటు పలు కీలక కంపెనీలను అమ్మేశాడని జగన్ ఆరోపించారు. 

అలాగే ఆంధ్రాలో నంద్యాల హనుమాన్ జంక్షన్ నుంచి బొబ్బిలి, ఆముదాల వలస, కొవ్వూరులలో సహకార రంగంలో ఉన్న చెరకు ఫ్యాక్టరీలను అమ్మేసిన చరిత్ర చంద్రబాబుది అంటూ వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు. హెరిటేజ్ కంపెనీ కోసం చిత్తూరు డైరీని కూడా మూసివేయించిన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. 

అంతేకాదు ఇంకా అనేక పిట్టలదొర కథలు చెప్తున్నాడని ధ్వజమెత్తారు. సెల్ ఫోన్ తానే కనిపెట్టానని, కంప్యూటర్ కూడా తానే కనిపెట్టానని సిగ్గులేకుండా అబద్దాలు చెప్తున్నాడంటూ మండిపడ్డారు. సెల్ ఫోన్ నేను కనిపెట్టాను, కంప్యూటర్ నేనే కనిపెట్టాను అంటున్నాడని విరుచుకుపడ్డారు. 

 అలాగే మైక్రోసాఫ్ట్  సంస్థ సిఈవో నాదెండ్ల సత్యకు కంప్యూటర్ కొనడం నేర్పించింది తానేనంటూ కథలు చెప్తున్నాడంటూ విరుచుకుపడ్డారు. బ్యాండ్మింటన్ సింధూకు బ్యాండ్మింటన్ ఎలా ఆడాలో నేర్పించాడట. ఇలా నోటికి ఏది పడితే అది ప్రజలు నమ్ముతారా అన్నది కూడా ఆలోచించకుండా అబద్దాలు చెప్తూనే ఉంటాడని విరుచుకుపడ్డారు జగన్.  

Follow Us:
Download App:
  • android
  • ios