శ్రీకాకుళం: ప్రత్యేక హోదాపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన ప్రకటనను స్వాగతిస్తూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కేసీఆర్‌ మద్దతు ప్రకటిస్తే చంద్రబాబు దాన్ని రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. 

పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి స్పందించి ఏపీకి హోదా కోసం కేంద్రానికి లేఖ రాస్తానని చెప్తే ఎవరైనా ఆనందించి స్వాగతిస్తారని జగన్ అన్నారు. కేసీఆర్‌ మద్దతుతో మొత్తం 42 మంది ఎంపీలవుతారని, బలం దొరుకుతుందని ఆయన అన్నారు. 

అయితే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని జగన్ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా పలాస బహిరంగ సభలో ప్రసంగించారు.
ఎన్నికలు సమీపిస్తున్నందున ఇన్నేళ్లు పట్టించుకోని కడప ఉక్కు పరిశ్రమకు ఆగమేఘల మీద శంకుస్థాపనలు చేశారని, చుక్కనీరు కూడా పోలవరం ప్రాజెక్టులో లేకపోయినా గేట్లు బిగింపు పేరుతో హంగామా చేస్తున్నారని విమర్శించారు. 

రాజధానిలో ఐదేళ్లలో శాశ్వత భవనం ఒక్కటి కూడా నిర్మించని చంద్రబాబు ఇప్పుడు రెండెకరాలలోని బొమ్మ భవనాలను చూపించడానికి బస్సులు వేస్తున్నారని అన్నారు. 

ఎప్పటినుంచో ఉన్నసమస్యలను తానేదో కొత్తగా కనిపెట్టినట్లు పవన్‌ కల్యాణ్‌ ఆయా ప్రాంతాలకు వెళ్లి హడావుడి చేస్తారని, చంద్రబాబుకు ఎప్పుడు కష్టం వచ్చినా పవన్‌ రంగంలోకి దిగుతారని అన్నారు. వీరిద్దరూ పార్ట్‌నర్స్‌ అని, వైసీపీ అధికారంలోకొస్తే ఉద్దానం కిడ్నీ బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని చెప్పారు.  మహేష్‌ బాబు సినిమాలోని  డైలాగ్‌ను గుర్తు చేస్తూ... జగన్‌ అనే నేను... మీ అందరికీ హామీ ఇస్తున్నా అంటూ మాట్లాడారు.