Andhra Pradesh: రైతులకు గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లో రూ. 22 కోట్లు జమ చేసిన సీఎం జగన్
గులాబ్ తుపాన్ కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు రూ. 22 కోట్ల పంట నష్టపరిహారాన్ని (Compensation) ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసినట్టుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) వెల్లడించారు.
ప్రకృతి విపత్తుల వల్ల ఏ సీజన్‌లో నష్టం జరిగితే.. ఆ సీజన్ ముగియకముందే నష్టపోయిన ప్రతి రైతులకు పరిహారం అందించే కొత్త సంప్రాదాయాన్ని అవలంభిస్తున్నాం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చెప్పారు. ఈ క్రమంలోనే గులాబ్ తుపాన్ కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు రూ. 22 కోట్ల పంట నష్టపరిహారాన్ని (Compensation) రైతన్న ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, రైతులు ఇబ్బంది పడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందని తెలిపారు. 62 శాతానికిపైగా మంది వ్యవసాయంపై ఆధారపడ్డారని సీఎం జగన్ తెలిపారు. రైతులు నష్టపోకూడదని ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు.
ఏ సీజన్‌లో జరిగిన నష్టానికి అదే సీజన్‌లో పరిహారాన్ని రైతులకు నేరుగా చెల్లిస్తామని తెలిపారు. రెండు నెలల క్రితం వచ్చిన గులాబ్ తుపాన్ కారణంగా 34,586 మంది రైతులకు రూ. 22 కోట్ల పంట నష్టపరిహారాన్ని సీజన్ ముగియకముందే రైతన్న ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. పూర్తి పారదర్శకతతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. పారదర్శకతో గ్రామాల్లో నష్టపోయిన రైతుల జాబితాను ప్రదర్శించి.. వారి ఖాతాల్లోకే నేరుగా నష్ట పరిహారం జమ చేస్తున్నట్టుగా చెప్పారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని సీఎం జగన్ అన్నారు. రూ. 22 కోట్లకు కూడా ఇంతా ప్రచారం అవసరమా అని కొంత మంది గిట్టనివారు ప్రచారం చేస్తున్నారని జగన్ అన్నారు.
ఈ రెండున్నరేళ్లలో కేవలం వైఎస్సార్ రైతు భరోసా ద్వారానే రూ. 18,777 కోట్ల రూపాయలు రైతులు చేతుల్లో నేరుగా పెట్టడం జరిగిందన్నారు. వైఎస్సార్ సున్న వడ్డీ పథకం ద్వారా దాదాపు 1,674 రైతులకు ఇవ్వడం జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన బకాయిలను చెల్లించుకుంటూ వస్తున్నామని తెలిపారు.