జగనన్న తోడు నిధుల విడుదల.. కొత్తగా 56 వేల మందికి లబ్ది చేకూరుస్తున్నామన్న సీఎం జగన్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం జగనన్న తోడు ఏడో విడత నిధులను విడుదల చేశారు. 5,10,412 మంది లబ్దిదారులకు రూ. 549.70 కోట్ల నిధులు విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం జగనన్న తోడు ఏడో విడత నిధులను విడుదల చేశారు. 5,10,412 మంది లబ్దిదారులకు రూ. 549.70 కోట్ల నిధులు విడుదల చేశారు. రూ. 11.03 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను కూడ విడుదల చేశారు. ఆ నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాలో జమ చేశారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని చిరు వ్యాపారులకు పెట్టుబడి సాయంగా ఒక్కొక్కరికి రూ. 10 వేల నుంచి రూ. 13 వేల వరకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చిరు వ్యాపారులకు పెట్టుబడి సాయంగా వడ్డీలేని రుణాలను అందిస్తున్నామని చెప్పారు. వడ్డీల భారం నుంచి చిరు వ్యాపారులను ఆదుకుంటున్నామని తెలిపారు. ఈ విడదలో 5,10,412 మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. అందులో 4,54,267 మంది గతంలో ఒకటికంటే ఎక్కువ సార్లు రుణం పొంది తిరిగి చెల్లించిన వారు కాగా.. ఈసారి కొత్తగా మరో 56,145 మందికి తొలిసారి జగనన్న తోడు అందిస్తున్నామని తెలిపారు. జగనన్న తోడు ద్వారా ఇప్పటివరకు 15,87,492 మంది ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందారని చెప్పారు. 4.54 లక్షల మంది సకాలంలో రుణాలు చెల్లించి.. మళ్లీ రూ. 10 వేలు, ఆ పైన రుణాలు అందుకుంటున్నారని తెలిపారు. సకాలంలో రుణాలు చెల్లించినవారికి రూ. 13 వేల వరకు వడ్డీ లేని రుణం అందజేస్తున్నట్టుగా చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు చిరు వ్యాపారులకు రూ. 2,955.79 కోట్లు రుణాలు అందజేసినట్టుగా చెప్పారు. జగనన్న తోడు ద్వారా లబ్ది పొందినవారు 80 శాతం అక్కాచెల్లెమ్మలేనని తెలిపారు. లబ్దిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలేనని అన్నారు.