Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు ఉలిక్కిపడ్డారు: కేసీఆర్ ఎపి ఎంట్రీపై జగన్ స్పందన

తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనూ తాము పర్యటిస్తామని టీఆర్‌ఎస్‌ ప్రకటించడంతో చంద్రబాబు ఉలిక్కిపడ్డారని, అందుకే ప్రత్యేకహోదాను వ్యతిరేకించిన టీఆర్‌ఎస్‌ ఏపీలోకి రావడం ఎమిటని వంక  పెడుతున్నారని జగన్ అన్నారు. 

YS Jagan reacts on KCR's AP entry
Author
Srikakulam, First Published Dec 17, 2018, 10:43 AM IST

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెడుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన ప్రకటనపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు అడుగడుగునా రంగులు మారుస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో అనైతిక పొత్తుకు ప్రజలు గుణపాఠం చెప్పడంతో చంద్రబాబు మాట మార్చారని ఆయన అన్నారు. 
తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనూ తాము పర్యటిస్తామని టీఆర్‌ఎస్‌ ప్రకటించడంతో చంద్రబాబు ఉలిక్కిపడ్డారని, అందుకే ప్రత్యేకహోదాను వ్యతిరేకించిన టీఆర్‌ఎస్‌ ఏపీలోకి రావడం ఎమిటని వంక  పెడుతున్నారని జగన్ అన్నారు. అలాంటప్పుడు టిఆర్ఎస్ తో తెలంగాణ ఎన్నికల సమయంలో పొత్తుల కోసం ఎందుకు అర్రులు చాచారని ఆయన ప్రశ్నించారు. 
ఒకవేళ టీఆర్‌ఎస్‌తో పొత్తు కుదిరి ఉంటే చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసే వారా? అని ఆయన అడిగారు. రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికి వదిలేసి తమిళనాడులో కరుణానిధి విగ్రహావిష్కరణకు చంద్రబాబు వెళ్లడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.

దేవుడి ఆశీర్వాదంతో వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులానికో కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పారు. ప్రభుత్వ పథకాలను హోం డెలివరీ చేస్తానని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర  జగన్‌ ఆదివారం నరసన్నపేటలోని బహిరంగ సభలో ప్రసంగించారు. 

 గ్రామాల్లో అన్ని వర్గాలతో సచివాలయాలను ఏర్పాటు చేస్తామని, అన్ని అర్జీలను ఈ సచివాలయాలు 72 గంటల్లో పరిష్కరిస్తాయని ఆయన చెప్పారు. ఈ సచివాలయాలు సమర్థంగా పనిచేసేలా ప్రతి 50 ఇళ్లకు ఇక వలంటీర్‌ను నియమిస్తామని చెప్పారు. తద్వారా ప్రభుత్వ పథకాలన్నింటినీ హోం డెలివరీ చేస్తామని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios