ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూతనొత్సాహం నింపేందుకు వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర నేటితో ముగియనుంది.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూతనొత్సాహం నింపేందుకు వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర నేటితో ముగియనుంది. గత ఏడాది నవంబర్ 6 నుంచి ప్రారంభమైన ఈ ప్రజాసంకల్పయాత్ర అప్రతిహాతంగా 13 జిల్లాల్లో పూర్తి చేసుకుంది.
జగన్ తన పాదయాత్రలో 341 రోజులు, 3648 కిలోమీటర్లు, 134 నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాలు, 54 మున్సిపాల్టీలు, 8 నగరపాలక సంస్థలు, 124 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు.
జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టినప్పుడు కృష్ణమ్మ వారధి జనసంద్రాన్ని తలపించింది. అలాగే ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పవిత్ర నది గోదావరి నదిపై నిర్మించిన రోడ్ కమ్ రైలు వంతెన జనసంద్రాన్ని తలపించింది. ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది.
ఇకపోతే వైఎస్ జగన్ నిర్వహించిన 124 బహిరంగ సభలలో విశాఖపట్నం జిల్లా కంచర్లపాలెం బహిరంగ సభ ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఈ సభకు జనం భారీగా తరలిరావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సభగురించే చర్చ జరిగింది.
ఇకపోతే ఈ పాదయాత్రలో జగన్ నేరుగా కోటి మందికిపైగా ప్రజలను కలిశారు. వారి సమస్యలను తెలుసుకోవడంతోపాటు పరిష్కార మార్గాలు చెప్పడంతో పాటు గట్టి హామీ ఇచ్చారు. దాదాపు సంవత్సరం 2నెలలపాటు అంటే 14నెలలపాటు జరిగిన ఈ పాదయాత్ర 2019 బుధవారం బహుదానది తీరాన ఇచ్చాపురంలో ముగియనుంది.
జనవరి 9వరకు అంటే బుధవారం వరకు వైఎస్ జగన్ 13 జిల్లాలలో 341 రోజులుపాటు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో 3,648 కిలోమీటర్ల మేర నడిచారు. అంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎంత దూరమో అంత దూరం జగన్ ప్రజా సంకల్పయాత్ర చేపట్టారు. మెుత్తం రాష్ట్రవ్యాప్తంగా 134 నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర విజయవంతంగా సాగింది.
పాదయాత్ర ఆద్యంతం 231 మండలాల్లో 2,516 గ్రామాల మీదుగా విజయవంతంగా కొనసాగింది. 54 మున్సిపాల్టీలు, 8 నగర పాలక సంస్థలను కవర్ చేసేలా ఈపాదయాత్ర రూపుదిద్దుకుంది. 341 రోజుల పాదయాత్రలో వైఎస్ జగన్ 124 బహిరంగ సమావేశాలు, 55 ఆత్మీయ సమ్మేళనాలలో పాల్గొన్నారు వైఎస్ జగన్.
ఇకపోతే ప్రజా సంకల్పయాత్ర ముగింపు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. పాదయాత్రకు ప్రతీకగా ఇచ్చాపురంలో భారీ పైలాన్ ను ఏర్పాటు చేసింది. జగన్ పాదయాత్ర విశేషాలను వివరించేలా గ్రానైట్ పలకలపై అద్భుతమైన డిజైన్స్ తో పొందుపరిచారు.
పాదయాత్ర సంకల్పాన్ని చాటిచెప్పడంతోపాటు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఈ పైలాన్ ను నిర్మించారు. ఇచ్చాపురానికి 2 కిలోమీటర్ల దూరంలో బహుదానది తీరాన ఈ స్థూపాన్ని ఏర్పాటు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ స్థూపాన్ని బుధవారం భోజన విరామం అనంతరం వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు.
చివరి రోజు అయిన బుధవారం ఉదయం వైఎస్ జగన్ ఇచ్చాపురం నియోజకవర్గం పెద్ద కొజ్జిరియా నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి లొద్దకుట్టి మీదుగా జగన్ పాదయాత్ర ఇచ్ఛాపురం వరకు ముందుకు సాగుతుంది. భోజన విరామం అనంతరం ప్రజాసంకల్పయాత్ర ముగింపు సూచకంగా ఏర్పాటు చేసిన విజయసంకల్ప స్తూపాన్నిఆవిష్కరిస్తారు.
స్థూపం ఆవిష్కరణ అనంతరం అక్కడి నుంచి తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రను గుర్తు చేసేలా ఏర్పాటు చేసిన ప్రజాప్రస్థానం విజయస్తూపం, తన సోదరి షర్మిల చేసిన మరో ప్రజాప్రస్థానం స్తూపం మీదుగా ఇచ్ఛాపురం పాత బస్టాండ్ సెంటర్‌లో జరిగే బహిరంగ సభ ప్రాంతానికి వైఎస్ జగన్ చేరుకుంటారు.
సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. అయితే జగన్ ముగింపు సభలో కీలక ప్రకటనలు ఉంటాయంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. రైతు రుణమాఫీ పథకం ప్రకటిస్తారని, అభ్యర్థులను ప్రకటిస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల సమన్వయ కర్తలు ఆ లిస్ట్ లో తమ పేరు ఉంటుందో లేదోనని టెన్షన్ పడుతున్నారు. ఇకపోతే ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వైసీపీ శ్రేణులు ఇప్పటికే ఇచ్చాపురం చేరుకున్నారు.
రాయలసీమ ప్రాంతాల నుంచి లక్షలాది మందిగా వైసీపీ కార్యకర్తలు జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు తరలివచ్చారు. జగన్ పాదయాత్ర సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 9, 2019, 7:34 AM IST