అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకొన్నారు. ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని యోచిస్తున్నారు. 25 మందికి కేబినెట్‌లో చోటు కల్పించనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేబినెట్‌లో చోటు కల్పించనున్నట్టు జగన్ స్పష్టం చేశారు.

అమరావతిలో శుక్రవారం నాడు వైఎస్ఆర్‌సీఎల్పీ సమావేశంలో మంత్రివర్గం ఏర్పాటుకు సంబంధించి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులను కట్టబెట్టనున్నారు.

చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలో ఇద్దరికి మాత్రమే  డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన కేఈ కృష్ణమూర్తికి, కాపు సామాజిక వర్గానికి చెందిన నిమ్మకాయల చినరాజప్పకు డిప్యూటీ సీఎం పదవులు కట్టబెట్టారు.

కానీ వైఎస్ జగన్ మాత్రం తన కేబినెట్‌లో ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులను కట్టబెట్టనున్నారు. రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించనున్నారు.

25 మందికి రేపు  కేబినెట్‌లో చోటు దక్కనున్నట్టుగా జగన్ ప్రకటించారు. రెండున్నర ఏళ్ల తర్వాత 90 శాతం మంత్రులను మార్చనున్నట్టు జగన్ నిర్ణయం తీసుకొన్నారు. తన కేబినెట్‌లో కూడ ఎస్సీ, ఎస్టీ, బీసీలకే పెద్ద పీట వేస్తామని జగన్ హామీ ఇచ్చారు.


సంబంధిత వార్తలు

రాష్ట్రమంతా మనవైపే చూస్తుంది: ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం