ఆంధ్ర‌ప్ర‌దేశ్ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి  గౌతమ్‌రెడ్డి (Mekapati Goutham Reddy) భౌతికకాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులర్పించారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్ ఓదార్చారు.  

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి (Mekapati Goutham Reddy) భౌతికకాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులర్పించారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డి... జూబ్లీహిల్స్‌లోని గౌతమ్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన తర్వాత.. ఆయన కుటుంబ సభ్యులను జగన్ దంపతులు పరామర్శించారు. కొడుకు మరణంతో కన్నీరు మున్నీరవుతున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డిని సీఎం జగన్ ఓదార్చారు. రాజమోహన్‌రెడ్డి పక్కన కూర్చున్న జగన్ ఆయనకు ధైర్యం చెప్పారు. భారతి కూడా గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

సీఎం జగన్‌తో పాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు ఆదిమూలపు సురేష్, అనిల్‌కుమార్ యాదవ్.. గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి నివాళుర్పించారు.

Scroll to load tweet…

ఇక, మంత్రి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణం పట్ల సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొలినాళ్ల నుంచి సుపరిచితుడైన యువనాయకుడు గౌతమ్ రెడ్డి అని జగన్ తెలిపారు. గౌతమ్‌రెడ్డి పరమపదించడం అత్యంత విచారకరమన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలతో తన నివాసంలో సమాశయ్యారు. గౌతమ్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. గౌతమ్ రెడ్డితో చిన్ననాటినుంచే తనకు బాగా పరిచయముందని.. ఒక స్నేహితుడినే కాకుండా సమర్థుడైన మంత్రిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి మృతితో ఈరోజు తన అధికార కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్న జగన్.. హైదరాబాద్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.


గౌతమ్ రెడ్డి మరణంతో ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలను ప్రకటించింది. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఇక, ఈ రోజు సాయంత్రం వరకు గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఉంచనున్నారు. అనంతరం ఈరోజు రాత్రికి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని ఆయన సొంత జిల్లా నెల్లూరు తరలించనున్నారు. ఎల్లుండి నెల్లూరు జిల్లాలోని సొంతూరు బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు అర్జున్ రెడ్డి విదేశాల్లో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత గౌతమ్ రెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.