అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో కీలక నేతలు చోటు దక్కించుకోలేకపోయారు. పార్టీకోసం శ్రమించిన వారు వివిధ సామాజిక సమీకరణాల ద్వారా మంత్రి పదవులకు దూరం కావాల్సి వచ్చింది. 

పార్టీ కోసం శ్రమిస్తూ నిరంతరం పోరాటం చేస్తూ మంత్రి పదవికి దూరమైన వారిలో రోజా ఒకరు. ఒకానొక దశలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మౌత్ వాయిస్ గా ఆమె నిలబడ్డారంటే అందులో ఎలాంటి సందేహంలేదు.  

దీంతో ఏనోట విన్నా మంత్రి రోజా అంటూ తెగ ప్రచారం జరిగిపోయింది. ఇకపోతే అసెంబ్లీ ఎన్నికల్్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడంతో జగన్ కేబినెట్ లో మంత్రిగా రోజా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ తెగ ప్రచారం జరిగింది. 

సోషల్ మీడియాలో అయితే ఇంకో అడుగు ముందుకు వేసి హోంశాఖ మంత్రిగా రోజా అంటూ కూడా మరో ప్రచారం జరిగింది. ఏది ఏమైనప్పటికీ వైయస్ జగన్ ముఖ్యమంత్రి ఆయన మంత్రి వర్గం అనేసరికి వినిపించిన మెుదటిపేరు రోజా. 

అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో రోజా మంత్రిపదవి దక్కించుకోలేకపోయారు. జగన్ తన కేబినెట్ లో చోటు ఆశించి భంగపడ్డ వారిని బుజ్జగిస్తూ వారికి సముచిత న్యాయం చేస్తూనే ఉన్నారు. ఈనేపథ్యంలో రోజాకు కీలక నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టే ఆలోచనలో వైయస్ జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే జగన్ కేబినెట్ లో చోటు ఆశించి భంగపడ్డ వారికి కీలక పదవులు  కట్టబెట్టారు వైయస్ జగన్. చిత్తూరు జిల్లా నుంచి తన సన్నిహితుడు అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మంత్రి పదవిగా అవకాశం ఇవ్వలేదు జగన్. దీంతో అతనికి అసెంబ్లీలో ప్రభుత్వవిప్ పదవితోపాటు తుడా చైర్మన్ గా అవకాశం కల్పించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో రోజాకు కూడా మంచి పదవి కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది. రోజాకు కీలకమైన ఆర్టీసీ చైర్మన్ పదవిని కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై చర్చకు వచ్చిందని అందుకు రోజా కాస్త సమయం అడిగారంటూ కూడా వార్తలు వినపడుతున్నాయి. 

ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉంది. ఇకపోతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని సీఎం వైయస్ జగన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. మరో రెండు నెలల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి అవసరమయ్యే మార్గదర్శకాలను సిద్ధం చేయాలని ఇప్పటికే జగన్ ఆదేశించారు. 

ఒకవేళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఇక ఆర్టీసీ చైర్మన్ పదవి ఎందుకు అని రోజా ఆలోచిస్తున్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. అందువల్లే రోజా ఆర్టీసీ చైర్మన్ పదవిపై కాస్త ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. 

మరోవైపు మహిళా కమిషన్ చైర్మన్ పదవిని సైతం రోజాకు జగన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి రోజా మహిళల సమస్యలపై తీవ్ర స్థాయిలో గళమెత్తుతారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళలపై జరిగిన దాడుల నేపథ్యంలో ఆమె రాష్ట్రవ్యాప్తంగా తిరిగి టీడీపీ నేతలను ఉతికి ఆరేసింది. 

ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇస్తే బాగుంటుందని కొందరు జగన్ కు సూచించడంతో ఆ పదవిపై కూడా ఆలోచించమని జగన్ ఎమ్మెల్యే రోజాకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇకపోతే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా నన్నపునేని రాజకుమారి ఉన్నారు. ఆమె ఈ పదవి నుంచి తప్పుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆమె కలిశారు. జగన్ కు శుభాకాంక్షలు తెలపడంతోపాటు తనకు ఈ పదవిలో కొనసాగాలని ఉందని చెప్పినట్లు ఆమె స్పష్టం చేశారు. 

ఆమె తప్పుకుంటారా లేదా అనే విషయాన్ని పక్కన బెడితే ఒక ఎమ్మెల్యేగా ఉన్న రోజా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ గా పనిచేయవచ్చా అని ఆలోచనలో పడ్డారట. లా ప్రకారం ఏమైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉందా అన్న కోణంలో జగన్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఏది ఏమైనప్పటికీ మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో రోజా అభిమానులు, నగరి నియోజకవర్గ ప్రజలు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వారిని శాంతించేందుకు జగన్ ఒక కీలక పదవి కట్టబెట్టే యోచనలో ఉన్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. 

ఈ వార్తలు కూడా చదవండి

షాకిచ్చిన జగన్: రోజాకు ఎందుకంత క్రేజ్?