హైదరాబాద్: ఐఎఎస్ అధికారుల పని తీరు పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది ఐఎఎస్ అధికారులకు గుబులు పట్టుకుంది. 

తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్ పెద్ద యెత్తున ఐఎఎస్ అధికారులను బదిలీ చేశారు. దాంతో సమస్య వచ్చినప్పుడు కచ్చితంగా, వెంటనే ఆయా శాఖలు స్పందిస్తాయని ఆయన ఆశించారు. అయితే, ఫలితాలు తాను ఆశించిన మేరకు లేవని జగన్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. 

దాదాపు 20 మంది ఐఎఎస్ అధికారులపై ముఖ్యమంత్రి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తమ తమ జిల్లా బాధ్యతలను ఇంచార్జీ మంత్రులు తీసుకోవాలని ఆయన ఆశిస్తున్నారు. విత్తనాల కొరతతో రైతులు రోడ్ల మీదికి వచ్చారు. అయినప్పటికీ సమస్యపై ఐఎఎస్ అధికారుల్లో చలనం లేకపోవడం పట్ల ముఖ్యమంత్రి అసహనంగా ఉన్నట్లు చెబుతున్నారు. 

సమస్య వచ్చిన వెంటనే దాన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఐఎఎస్ అధికారులకు ఉంటుందని జగన్ చెబుతున్నారు. అయినా విత్తనాల సమస్యను అధికారులు పట్టించుకోలేదని అంటున్నారు. విత్తనాల కొరత ఉందనేది నిజమని, అయితే ప్రత్యామ్నాయాలను చూపడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన భావిస్తున్నారు. 

తన నిర్ణయాలను అమలు చేయడంలో తన వేగాన్ని కొంత మంది ఐఎఎస్ అధికారులు అందుకోలేకపోతున్నారని కూడా జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. తన నిర్ణయాలను అమలు చేయడంలో వేగంగా ముందుకు కదలడం లేదని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

మూడు రకాల ఎమ్మెల్యేలు లేదా మంత్రులు ఉన్నట్లు జగన్ భావిస్తున్నారు. కొంత మంది అధికారుల బదిలీకి సిఫార్సులు చేస్తున్నారు. కొంత మంది వినతులు సమర్పిస్తున్నారు. మరికొంత మంది బదిలీ చేయించడానికి డబ్బులు తీసుకుంటున్నారు. 

ప్రకాశం జిల్లాలోని ఓ ఎమ్మెల్యే బదిలీ చేయించడానికి సర్కిల్ ఇన్ స్పెక్టర్ నుంచి రూ 10 లక్షలు తీసుకున్నాడు. అ విషయం తెలిసి జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ డబ్బును తిరిగి ఆ అధికారికి ఇప్పించారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఇంచార్జీ మంత్రులకు సూచించారు.