Asianet News TeluguAsianet News Telugu

జగన్ కొత్త కొలువుకు రెడీ: ప్రస్తుత మంత్రులందరికీ ఉద్వాసన, రోజా సహా రేసులో వీరే...

కొత్త మంత్రులతో కొలువు దీరడానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రులందరినీ తప్పించి కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఆలోచనతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.

YS Jagan may reshuffle his cabinet after dasara, new face will be inducted
Author
Amaravati, First Published Sep 27, 2021, 12:30 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకుగా దాదాపుగా ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు చెబుతున్నారు.  ప్రస్తుతం ఉన్న మంత్రులందరినీ తొలగించి కొత్తవారితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన కసరత్తును ఇప్పటికే ప్రారంభించినట్లు చెబుతున్నారు. 

తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనతో చెప్పిన విషయాలను బయట పెట్టటం కూడా ఒక వ్యూహం ప్రకారమే జరిగినట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడున్న మంత్రుల్లో కొందరిని తొలిగించి మరి కొందరిని కొనసాగిస్తే కొత్త సమస్యలు తప్పవనే అంచనాకు జగన్ వచ్చారు. దీంతో విధానపరమైన నిర్ణయంగా అందరినీ తప్పిస్తే సమస్య ఉండదని భావిస్తున్నారు.2024లో ఎన్నికలను ఎదుర్కోవడానికి వీలుగా కొత్త మంత్రులు కొలువు దీరుతారని అంటున్నారు. ఇందుకుగాను చాలా మంది సీనియర్లను, బలమైన గొంతు ఉన్నవారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు.         

దసరా పండుగ సమయంలో మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఇంటలిజెన్స్.. సర్వే సంస్థల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా సీఎం జగన్ కేబినెట్ కూర్పు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో..ప్రాంతీయ-సామాజిక సమీకరణాలు కీలకమవుతాయని అంటున్నారు. ప్రాంతీయ సమీకరణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారని అంటున్నారు. 

శ్రీకాకుళం జిల్లా నుండి ప్రస్తుత శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం మంత్రి పదవి ఆశిస్తున్నారు. అదే విధంగా ధర్మాన క్రిష్ణదాస్ స్థానంలో ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు కు ఖాయమని చెబుతున్నారు. 

విజయనగరం జిల్లాలో కొత్తగా కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్నదొర రేసులో ముందున్నారు. అయితే,ఎస్టీ మహిళకు అవకాశం ఇవ్వాలని భావిస్తే రాజన్న దొరకు అవకాశం దక్కకపోవచ్చునని అంటున్నారు.            

విశాఖ జిల్లా నుండి గుడివాడ అమర్‌నాథ్‌, కరణం ధర్మశ్రీ,పెట్ల ఉమా శంకరగణేష్‌ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అయితే, ఈ జిల్లా నుంచి ముత్యాల నాయుడు పేరు వినిపిస్తోంది.నిఘా- సర్వే నివేదికల ఆధారంగా విశాఖ నగరానికి అవకాశం ఇవ్వాలనుకుంటే అమర్ నాధ్ కు ఛాన్స్ ఉంది. గిరిజన కోటాలో ఫాల్గుణ, కె.భాగ్యలక్ష్మి కూడా మంత్రి పదవిని కోరుకుంటున్నారు.        

తూర్పు గోదావరి జిల్లా నుండి ఇప్పుడున్న ముగ్గురు స్థానంలో కొత్త ముగ్గురికి అవకాశం ఉంది. దాడిశెట్టి రాజా మంత్రి పదవిని కోరుకుంటున్నారు. పైగా యనమల సోదరుడిని రెండు సార్లు ఓడించటంతో పాటుగా తొలి నుంచి జగన్ విధేయుడిగా ఉన్నారు. కన్నబాబు స్థానాన్ని ఆయనతో భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ జిల్లా నుంచి ఎస్సీ కోటా నుంచి ఒకరికి అవకాశం కల్పించాల్సి ఉంటుంది.మహిళలు- బీసీ వర్గాలకు ప్రాధాన్యం అయితే,ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీకి దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. బీసీ వర్గానికి ఇక్కడ ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంటుంది.దీంతో.. ముమ్మడివరం ఎమ్మెల్యే సతీష్ కు ఖాయమని ప్రచారం సాగుతోంది.  గిరిజన కోటాలో నాగులాపల్లి ధనలక్ష్మి పోటీలో ఉన్నారు.   ఈమె భర్త ప్రస్తుతం డిసిసిబి ఛైర్మన్‌గా ఉన్నారు. 

పశ్చిమగోదావరిలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. రాజకీయంగా ఉభయ గోదావరి జిల్లాలు కీలకం కావటంతో ఈ జిల్లా నుంచి ఎస్సీ-క్షత్రియ-కాపు వర్గానికి అవకాశం దక్కనుంది.  క్షత్రియ కోటాలో ముదునూరి ప్రసాద రాజు... కాపు వర్గం నుంచి కొట్టు సత్యానారాయణ లేదా గ్రంధి శ్రీనివాస్ పేర్లు రేసులో ఉన్నాయి. ఎస్సీ వర్గం నుంచి తలారి లేదా ఎమ్మెల్సీకి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.

కృష్ణాజిల్లాలో కొలుసు పార్థసారథికి మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది.  కమ్మ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే గుంటూరు జిల్లా నుంచి మర్రి రాజశేఖర్ మంత్రి పదవి దద్కించుకొనే ఛాన్స్ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అబ్బయ్య చౌదరి పేరు వినిపిస్తున్నా.. కమ్మ వర్గానికి క్రిష్ణా లేదా గుంటూరు జిల్లా నుంచే ఎంపిక చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇక,క్రిష్ణా జిల్లా నుంచి సామినేని ఉదయభాను..మల్లాది విష్ణు..జోగి రమేష్‌.మేకా వెంకట ప్రతాప అప్పారావు కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు.

టీడీపీ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో కొత్త వ్యూహాలతో గుంటూరు జిల్లా నుండి మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సోదరుడు అయోధ్య రామిరెడ్డికి ఎంపి అవడంతో ఆర్కేకు మంత్రి పదవి ఇస్తారా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విడదల రజని, ముస్లిం మైనార్టీ నుండి మహ్మద్‌ ముస్తఫా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. కాపు కోటాలో అంబటి రాంబాబుకు ఖాయమని చెబుతున్నారు.         

ప్రకాశం జిల్లా నుండి గతంలో పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా చేసిన మహీధర్‌రెడ్డికి బెర్తు దొరకనున్నట్లు తెలిసింది.అన్నా రాంబాబు కూడా మంత్రి పదవిని కోరుతున్నారు.నెల్లూరు నుండి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి,ఆనం రామ నారాయణరెడ్డి , ఎస్‌సి కోటాలో కిలివేటి సంజీవయ్య మంత్రి పదవి రేసులో ఉన్నారు. 

చిత్తూరు జిల్లా నుండి రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి బరిలో ఉన్నారు. కడప నుండి కొరుముట్ల శ్రీనివాసులు..శ్రీకాంత్ రెడ్డి ప్రముఖంగా రేసులో ఉన్నారు.అయితే,సీ రామచంద్రయ్య కు అవకాశం దక్కే ఛాన్స్ ఉందని సమాచారం. అనంతపురం జిల్లాలో అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఉండగా... మహిళా కోటాలో ఉషశ్రీచరణ్‌, జనులగడ్డ పద్మావతి, ఎస్‌సి కోటాలో తిప్పేస్వామి పోటీ పడుతున్నారు.

కర్నూలు నుండి శిల్పా చక్రపాణిరెడ్డి కి ఖాయమని ప్రచారం సాగుతోంది. బుగ్గన ను సైతం తప్పిస్తుండటంతో రెడ్డి వర్గంతో పాటుగా బీసీ వర్గానికి ఈ జిల్లా నుంచి అవకాశం దక్కనుంది. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ..సామాజిక సమీకరణాలు - జిల్లాల లెక్కలు...వచ్చే ఎన్నికలు..ప్రతిపక్షాల బలం వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని సీఎం జగన్ తన ఎన్నికల కేబినెట్ పై నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. దీంతో.. ఈ ఆశావాహుల్లో చివరికి బెర్తు ఖాయమయ్యేది ఎవరికో జగన్ నిర్ణయం తరువాతనే అధికారికంగా తెలిసే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios