Asianet News TeluguAsianet News Telugu

కేంద్రం వాదన ఇదీ: వినని జగన్, భవిష్యత్తులో పిపిఎల షాక్?

జగన్ సర్కార్ మాత్రం చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని ఒప్పందాల వల్ల రోజుకి 7కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని చెబుతోంది. ఇలా రోజుకు 7 కోట్ల మేర నష్టాలను గనుక సంవత్సరానికి లెక్కగడితే దాదాపుగా 2500కోట్ల మేర సంవత్సరానికి  రాష్ట్ర ఖజానాకు గండి పడుతోందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది.

YS Jagan may face trouble with cancelling PPAs
Author
Amaravathi, First Published Sep 4, 2019, 5:53 PM IST

పిపిఏల విషయంలో  కేంద్ర ప్రభుత్వ  సలహాను కూడా తోసిపుచ్చుతూ, చంద్రబాబు హయాంలో జరిగిన ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పిపిఎలను) రద్దు చేసే యోచనతో  జగన్ సర్కార్ దూసుకుపోతుంది. ఇదే గనుక జరిగితే, పెట్టుబడిదారుల, పారిశ్రామికవేత్తల సెంటిమెంట్లు దెబ్బతినే ప్రమాదం ఉందని కేంద్రం భావిస్తోంది. జగన్ సర్కార్ మాత్రం ఈ ఒప్పందాల వల్ల రోజుకి 7కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని చెబుతోంది. 

ఇలా రోజుకు 7 కోట్ల మేర నష్టాలను గనుక సంవత్సరానికి లెక్కగడితే దాదాపుగా 2500కోట్ల మేర సంవత్సరానికి  రాష్ట్ర ఖజానాకు గండి పడుతోందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. అసలే లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం, ఇలా అదనంగా చెల్లించే డబ్బులను వేరే ఏదైనా ఉపయుక్తమైన అభివృద్ధి కార్యక్రమానికి వాడుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కదా అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాదనను వినిపిస్తోంది. 

జులై నెలలో కేంద్ర మంత్రి ఆర్ కే సింగ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో సవివరంగా ఈ ఒప్పందాలను ఎందుకు రద్దు చేయకూడదో తెలిపారు. 

"పునరుత్పాదక విద్యుత్ ప్రోజెక్టుల వలన భారీ స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ప్రపంచంలోని ఎన్నో దేశాలకు చెందిన పెన్షన్ నిధులను ఈ రంగంలో భారతదేశమంతటా పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఒక వేళ భారత దేశంలో కాంట్రాక్టు నియమాలను గౌరవించరనో లేదా ఇక్కడ చట్టబద్దమైన కాంట్రాక్టులను కూడా రద్దు చేస్తారు అనే తప్పుడు సంకేతాలు వెళితే భవిష్యత్తులో  వచ్చే విదేశీ పెట్టుబడులపైన ప్రభావం పడుతుంది. ఇదే గనుక జరిగితే, భారత దేశ అభివృద్ధి కుంటుపడుతుంది" ఇది స్థూలంగా లేఖలో కేంద్రం తెలిపిన  విషయం. 

దీని తరువాత జగన్ సర్కార్ తొందరపాటు నిర్ణయాలు ఏమీ తీసుకోకున్నప్పటికీ, ఈ ఒప్పందాలను రద్దు చేయాలనే నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఎలాగైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలని నూతన దారులను వెదకడం ప్రారంభించింది. 

ఇందులో భాగంగానే, కేంద్రం విద్యుత్ చట్టాన్ని తెరమీదకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడిదారుల హక్కులను కాపాడాలని భావిస్తోంది. 

ఇలా చేయడం వల్ల పర్యావరణ హిత విద్యుతుత్పత్తి చేసే కంపెనీలకు ఏ ప్రభుత్వం కూడా బకాయిలు ఎగ్గొట్టకుండా చూడవచ్చు. ఆ కంపెనీలు తయారుచేసిన విద్యుత్తును  అగ్రీమెంటులో మాట్లాడుకున్న రేటుకు మాట్లాడుకున్న కాలంపాటు ఆ సదరు ప్రభుత్వం/సంస్థ కొనుగోలు చేయవలిసి ఉంటుంది. కేవలం గ్రిడ్ సేఫ్టీ కారణాల చేత తప్ప వేరే ఏ కారణాల వల్ల కూడా ఈ అగ్రీమెంటులను బుట్టదాఖలు చేయకూడదు. 

ఇప్పటికే జగన్ సర్కార్ సౌర విద్యుత్ తయారీదారులకు, పవన విద్యుత్ తయారీదారులకు విద్యుత్ తయారీని ఆపేయాలని మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. తాము ఇంకా పాత అగ్రీమెంట్ల ఆధారంగా విద్యుత్ కొనుగోలు చేయదల్చుకోట్లేదని తెలిపింది. 

ఈ తరుణంలో కేంద్ర సర్కార్ ఈ విద్యుత్ చట్టాన్ని తెర మీదకు తీసుకొచ్చి, భారతదేశ విద్యుత్ లోడ్ ను మేనేజ్ చేసే 'పవర్ సిస్టం ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్' ను రంగంలోకి దించింది. 'ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏవైనా  గ్రిడ్ సేఫ్టీ కారణాల వల్ల విద్యుత్ కొనుగోల్లను ఆపిందా?' అని పరిశీలించి నివేదిక ఇవ్వమని కోరింది. ఇప్పటికే ఈ సదరు సంస్థ ఈ పనిపైన కసరత్తులు మొదలుపెట్టినట్టు సమాచారం. 

ఈ నివేదికలో ఒకవేళ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లను ఆపడానికి గ్రిడ్ సేఫ్టీ కారణం కాదు అని తేలితే, జగన్ సర్కార్  పాత విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్రకారమే విద్యుత్తును ఖచ్చితంగా కొనుగోలు చేయవలిసి ఉంటుంది. ఒకవేళ కొనుగోలు చేయకున్నా కూడా అగ్రీమెంటులో పేర్కొన్నంత కాలం డబ్బు మాత్రం చెల్లించవలిసి ఉంటుంది. 

ఈ విషయాలను పరిశీలించిన తరువాత  జగన్ సర్కార్ కు విద్యుత్ అగ్రీమెంట్ల షాక్ తగిలేలా కనపడుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios