అమరావతి: ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ మెదలవుతుందా....?తెలుగుదేశం పార్టీయే టార్గెట్ గా బీజేపీ స్కెచ్ వేస్తోందా...?ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగకముందే దిగి టీడీపీ నాయకులను లాగేయాలని బీజేపీ వ్యూహరచన చేస్తోందా....?

ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ పాచిక పారినట్లేనా....?టీడీపీలో ఫస్ట్ వికెట్ డౌన్ అయిందంటూ వస్తున్న వార్తల్లో నిజముందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం తెలుగుదేశం పార్టీపై ప్రత్యేక దృష్టిసారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఎలాగైతే చంద్రబాబు దెబ్బకొట్టారో అలాగే దెబ్బకొట్టాలని జగన్ భావిస్తున్నారని మంత్రి వర్గ విస్తరణ అనంతరం జగన్ చేపట్టబోయే కార్యక్రమం అదేనని కూడా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. మరికొన్ని రోజుల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. 

దీంతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీపై ఫోకస్ పెట్టింది బీజేపీ జాతీయ నాయకత్వం. కేంద్రంలో అఖండ విజయం సాధించిన నేపథ్యంలో ముందుగా టీడీపీ ఎంపీలను ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. 

అంతేకాదు తెలుగుదేశం పార్టీలో కీలక నేతలను సైతం తమ పార్టీలోకి చేర్చుకోవాలని స్కెచ్ వేస్తోంది. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. విప్ పదవిని తీసుకునేందుకు నిరాకరించారు. కేశినేని నాని ఆపరేషన్ ఆకర్ష్ కు ఆకర్షితులయ్యారని ప్రచారం కూడా జరుగుతోంది.  

ఇదంతా ఒక ఎత్తైతే ఏపీలో సీబీఐకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై తెలుగుదేశం పార్టీలోని కీలక నేతల గుండెల్లో గుబులు రేపుతోంది. ఇప్పటికే సీబీఐ సోదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి.

మరికొందరిపై కూడా బీజేపీ సీబీఐని అస్త్రంగా ప్రయోగించాలని చూస్తోందని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఇన్ కం ట్యాక్స్ దాడులతో తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపించిందని ఇప్పటికీ ప్రచారం జరుగుతోంది. 

టీడీపీ కీలక నేతలైన సుజనాచౌదరి, గల్లా జయదేవ్, సీఎం రమేష్, బీద మస్తాన్ రావ్, పుట్టా సుధాకర్ యాదవ్ లతోపాటు కీలక నేతలపై ఐటీ దాడులు చేయించి ఎన్నికల్లో హల్ చల్ చేయించిందంటూ టీడీపీయే ఆరోపించింది.   

ఆ సమయంలో ఏపీలో సీబీఐ ఎంట్రీకి చంద్రబాబు ప్రభుత్వం అడ్డుచెప్పడంతో ఐటీ దాడులు మాత్రమే జరిగాయని ఇప్పుడు సీబీఐ దాడులు జరిగే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. వైయస్ జగన్ సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చంద్రబాబు జుట్టును బీజేపీకి అందించారంటూ వార్తలు సైతం వస్తున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే వారిని పార్టీలో చేర్చుకోవడం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై సీబీఐ, ఐటీలను రంగంలోకి దింపాలని బీజేపీ వ్యూహరచన చేస్తోందని ప్రచారం జరుగుతోంది. 

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం తెలుగుదేశం పార్టీపైనే ఫోకస్ పెట్టింది. తెలుగుదేశం పార్టీ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు త్వరలో భవిష్యత్ కార్యచరణ కూడా ప్రకటించనుందని తెలుస్తోంది. 

తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే తొలి ఫ్యామిలీ సైతం ఇప్పటికే రెడీ అయిపోయిందని తెలుస్తోంది. జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇప్పటికిప్పుడే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలతో టచ్ లో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేవారు తమ పదవులకు, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వస్తేనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటారని లేకపోతే నో ఎంట్రీ అంటూ ఇప్పటికే వైయస్ జగన్ స్పష్టం చేశారు. జగన్ స్టార్ట్ చేయబోయే ఆపరేషన్ ఆకర్ష్ ఎలా ఉండబోతుందో అనేది వేచి చూడాలి మరి. 

మెుత్తానికి అటు బీజేపీ ఇటు వైసీపీల నుంచి ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని చంద్రబాబు అండ్ కో ఆందోళనలో ఉన్నారట. మోదీని టార్గెట్ చేస్తూ చంద్రబాబు చేసిన రాద్ధాంతం ఫలితమే టీడీపీకి ఎదురవుతున్న ఇబ్బందులకు కారణాలంటూ ఏపీలో చర్చ జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో అన్నది వేచి చూడాలి.