Asianet News TeluguAsianet News Telugu

40 ఏళ్ల ఇండస్ట్రీ లేదు, ఎల్లో మీడియా మద్దతు లేదు: చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు

ఏపీ శాసనసభలో సీఎం వైఎస్ జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తనకు 40 ఏళ్ల ఇండస్ట్రీ లేదని, వాళ్ల లాగా అనుభవం లేదని, ఎల్లో మీడియా మద్దతు లేదని ఆయన అన్నారు.

YS Jagan makes comments on Chandrababu in AP assembly
Author
Amaravathi, First Published May 20, 2021, 4:39 PM IST

అమరావతి: పేరు ప్రస్తావించకుండా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ మీద జరిగిన చర్చకు సమాధానమిస్తు గురువారం శాసనసభలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఒక్క రోజు జరిగిన శాసనసభా సమావేశాన్ని టీడీపీ బహిష్కరించిన విషయం తెలిసిందే.

వాళ్ల లాగా తనకు 40 ఏళ్ల ఇండస్ట్రీ లేకపోవచ్చు, వాళ్ల తనకు అనుభవం లేకపోవచ్చు, వాళ్ల లాగా తనకు ఎల్లో మీడియా మద్దతు లేకపోవచ్చు గానీ నిజాయితీ, చిత్తశుద్ధి ఉందని ఆయన అన్నారు. తమ ఎన్నికల మానిఫెస్టోను తాను భగవద్గీతగా, బైబిల్ గా, ఖురాన్ గా భావిస్తున్నానని ఆయన చెప్పారు. 

కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందరికీ అందిస్తున్నామని ఆయన చెప్పారు. తనకు ఓటేశారా, లేదా అని కూడా చూడకుండా అందరికీ తమ ప్రభుత్వ కార్యక్రమాలను అందిస్తున్నామని ఆయన చెప్పారు. 

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆయన తన ప్రసంగంలో వివరించారు. త్వరలో చేపట్టబోయే కార్యక్రమాలను కూడా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు అందిన డోసుల మేరకు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నామని ఆయన చెప్పారు. వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచిన తొలి రాష్ట్రం తమదేనని ఆయన అన్నారు. 

పరిస్థితి తెలిసినప్పటికీ వాళ్లు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం లేదని తమ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని ఆయన అన్నారు. తమకు 11 శాతం అవసరాల మేరకే కరోనా వ్యాక్సిన్ అందిందని చెప్పారు. భారత్ బయోటెక్ రామోజీ రావు బంధువుదేనని, పరిస్థితి ఏమిటో వారికి తెలుసునని ఆయన అన్నారు. అయినప్పటికీ కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios