2019 ఎన్నికలపై వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. సత్యవేడు నియోజకవర్గంలో పాదయాత్రలో ఉన్న జగన్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేకహోదాను గనుక భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకుంటే పొత్తుకు సిద్ధమంటూ ప్రకటించారు. హోదా హామీని నిలబెట్టుకుంటే మరో ఆలోచన లేకుండా భాజపాతో కలిసి నడిచేందుకు అభ్యంతరం లేదంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఓ జాతీయ ఛానల్ తో మాట్లాడుతూ, తనపై ఉన్నకేసులన్నీ కాంగ్రెస్, టిడిపి కలిసి పెట్టినవే అన్న విషయం అందరికీ తెలుసన్నారు.

తమ ప్రధాన టార్గెట్ చంద్రబాబునాయుడే అంటూ స్పష్టం చేశారు. అబద్దాలతో, అవినీతితో చంద్రబాబు పాలన సాగుతోందని మండిపడ్డారు. తాను కాంగ్రెస్ లో ఉన్నంత కాలం గౌరవీయనీయమైన వ్యక్తిగానే ఉన్నట్లు గుర్తుచేశారు.  పోయిన ఎన్నికల్లో కూడా చంద్రబాబు అబద్దపు హామీలిచ్చే అధికారంలోకి వచ్చినట్లు జగన్ మండిపడ్డారు. చంద్రబాబు ఏకకాలంలో ఇటు ప్రజలను అటు ప్రధానమంత్రిని మిస్ లీడ్ చేస్తున్నట్లు ధ్వజమెత్తారు.

జగన్ చేసిన తాజా వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ మొదలైంది. ఎందుకంటే, మూడున్నరేళ్ళుగా కేంద్రప్రభుత్వం ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చే ఉద్దేశ్యం లేదని తేలిపోయింది. ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో కేంద్రం ఇప్పటికే పలుమార్లు పిల్లిమొగ్గలేసిన సంగతి అందరూ చూస్తున్నదే. ప్రత్యేకహోదా అంశం ముగిసిన అధ్యాయమని కేంద్రమంత్రులతో పాటు చంద్రబాబు కూడా చాలాసార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఇటువంటి నేపధ్యంలో జగన్ వ్యాఖ్యలపై సర్వత్రా ఆసక్తి మొదలైంది.  జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం ఏమైనా స్టాండ్ మార్చుకుంటోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. లేకపోతే ఎటుతిరిగి ప్రత్యేకహోదాను భాజపా ఇవ్వదు కాబట్టి ధైర్యంగా జగన్ పొత్తుల విషయాన్ని ప్రస్తావించారా అన్న చర్చ కూడా జరుగుతోంది.