పాదయాత్రలో పాడి రైతుల కష్టాలు చూశా: జగన్
పాదయాత్రలో పాడి రైతులకు ఇచ్చిన హామీ మేరకు అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకొన్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
అమరావతి:పాదయాత్రలో పాడి రైతులకు ఇచ్చిన హామీ మేరకు అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకొన్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.అమూల్ సంస్థ ఏపీ రాష్ట్రంలోని మరో జిల్లాలో పాల సేకరణను ఇవాళ్టి నుండి ప్రారంభించనుంది.ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
రాష్ట్రంలో ఇప్పటికే చిత్తూరు, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అమూల్ సంస్థ పాలను సేకరిస్తోంది. ఇవాళ్టి నుండి పశ్చిమగోదావరి జిల్లాలోని 142 గ్రామాల్లో అమూల్ సంస్థ పాలను సేకరించనుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. లీటర్ పాల ధర కంటే లీటర్ మినరల్ వాటర్ ధర ఎక్కువ అని ప్రజలు తనకు పాదయాత్రలో చెప్పిన మాటలు గుర్తుకు ఉన్నాయన్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకొన్నామన్నారు.
పాలసేకరణ సమయంలో చెల్లించే ధరలు మిగిలిన సంస్థల కంటే అమూల్ సంస్థలోనే ఎక్కువ అని ఆయన చెప్పారు. ఈ సంస్థ ద్వారా పాడి రైతులకు మంచి లాభాలు వస్తున్నాయన్నారు. పాడి రైతులకు 10 రోజులకు ఒకేసారి డబ్బులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయన్నారు. పాల నాణ్యత, వెన్నతో ఐదు నుండి ఏడు రూపాయాల వరకు రైతులకు అదనపు ఆదాయం సమకూరుతోందన్నారు.పాల సేకరణలో అమూల్ సంస్థ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని ఆయన చెప్పారు.