హైదరాబాద్: అధికారాన్ని నిలబెట్టుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోజుకో డ్రామా వేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు "మామూలుగా తెలుగు సినిమాలు చూస్తూ ఉంటాం. సంవత్సరానికి ఐదారు రిలీజ్‌ అవుతూంటాయి. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్, మహేష్‌బాబు ఇలా ఒకటీ లేదా రెండు సినిమాలు రిలీజ్‌ చేస్తుంటారు. కానీ ఆరు మాసాల్లో ఎన్నికలనే సరికే చంద్రబాబు నాయుడు వారానికో సినిమా రిలీజ్ చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. "పెన్షన్‌లు రావడం లేదా.. అయ్యో ఇప్పుడే మంజూరు చేస్తా. అయ్యో మీకు ఇళ్లు మంజూరు కాలేదా.. ఇప్పుడే మంజూరు చేస్తున్నా. పోనీ ఇచ్చారా అంటే అదీ లేదు. అంతా డ్రామా. అయ్యో ప్రత్యేక హోదా రాలేదా? నాలుగేళ్లయి పోయింది. ఇంతవరకూ ప్రత్యేక హోదా రాలేదా? నేను ధర్మపోరాట దీక్ష చేస్తా. అదీ ఒక సినిమా" అని ఆయన అన్నారు. 

రాజధాని..అయ్యో ఇంతవరకూ కట్ట లేదా? బాహుబలి సినిమా అయిపోయింది ఇంతవరకూ కట్టడాలు లేవా? అదొక సినిమా అయిపోయిందని ఆయన చంద్రబాబుపై ధ్వజమెత్తారు. గ్రాఫిక్స్‌ చూపిస్తారని వ్యాఖ్యానించారు.

"అయ్యో పోలవరం.. పునాది దాటి ముందుకు పోలేదా.. నా మనవడిని కూడా తీసుకెళ్లి చూపిస్తా. స్పీడు పెంచుతా. 2018 జూన్‌ కంతా నీళ్లిస్తా. ఇదీ ఒక డ్రామా. ఇన్ని కొత్త సినిమాలు ప్రపంచంలో ఏ హీరో కూడా తీసి ఉండరు" అని జగన్ అన్నారు

హోదా విషయంలో "కాంగ్రెస్‌ మోసం చేసింది. బీజేపీ మోసం చేసింది. చంద్రబాబు నాయుడు మోసం చేసాడు. పవన్‌ కళ్యాణ్‌ అనే వ్యక్తి కూడా మోసం చేశాడు. అందరూ కలిసే ఈ మోసాలు చేశారు" అని అన్నారు. 

"25కు 25 ఎంపీలు.. మొత్తం వైఎస్సార్‌ పార్టీకే తెచ్చుకున్న తర్వాత దేశంలో ప్రధాన మంత్రి ఎవరైనా కానీ.. ఐ యామ్‌ నాట్‌ బాదర్డ్‌. బీజేపీ, కాంగ్రెస్‌ ఎవరైనా కానీ, ఎల్లయ్య కానీ, పుల్లయ్యకానీ, ఫెడరల్‌ ఫ్రంట్‌ తరపున రజనీ కానీ ఎవరైనా సరే.. ప్రత్యేక హోదా ఇదిగో నేను సంతకం పెట్టబోతున్నాను, నీ మద్దతు ఇవ్వు అని చెబితే 25 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీలతో మద్దతు ఇవ్వడానికి సిద్ధం" అని జగన్ అన్నారు. 

సంబంధిత వార్తలు

నేను కలవలేదు, కేసీఆర్ ను తగ్గించడమే: జగన్

పవన్ కల్యాణ్ మీద వైఎస్ జగన్ అంచనా ఇదీ...