అమరావతి: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ రెనివెబుల్ ఎనర్జీ డెవలపర్స్ తో గత చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై (పిపిఎలపై) విచారణకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపారు. పిపిఎల విచారణకు జగన్ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. 

పిపిఎల పునపరిశీలన సంబంధిత రంగంలోని పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బ తీస్తుందని, దానివల్ల భవిష్యత్తు బిడ్స్ కు, పెట్టుబడులకు ఇబ్బంది ఏర్పడుతుందని అంటూ కొద్ది రోజుల క్రితం కేంద్ర రెనివెబుల్ ఎనర్జీ కార్యదర్శి  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి లేఖ రాశారు.  

విండ్, సోలార్ ఎనర్జీ డెవలపర్స్ తో గత ప్రభుత్వం చేసుకున్న పిపిఎలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత చేసిన తొలి ప్రసంగంలో బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్కువ ధరలకు బహిరంగ మార్కెట్లో విద్యుత్తు లభ్యమవుతున్న స్థితిలో ఎక్కువ ధర పెట్టి పిపిఎలు చేసుకోవడం ఏమిటని ఆయన అడిగారు.