చంద్రగిరిలో జెండా ఎగరేసిన జగన్

First Published 8, Jan 2018, 7:21 AM IST
Ys jagan hoisted party flag in Naidus home constituency Chandragiri
Highlights
  • జగన్ పాదయాత్రకు జనాల్లో బ్రహ్మాండమైన స్పందన కనిపించింది.

జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులలో చంద్రబాబునాయుడు జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహిస్తే, చంద్రబాబు సొంత నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రబాబు సొంత నియోజకవర్గం అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, సొంత నియోజకవర్గాన్ని కాదని దశాబ్దాల క్రితమే జిల్లాలోని మారుమూల ప్రాంతమైన కుప్పంకు చంద్రబాబు తరలిపోయారనుకోండి అది వేరే సంగతి. చంద్రగిరిలో పోటీ చేయకపోయినా తరచూ నియోజకవర్గంలోని నారావారిపల్లెకు వెళుతూనే ఉన్నారు.

చంద్రగిరి నియోజకవర్గంలోని కొంత ప్రాంతాన్ని మాత్రమే జగన్ పాదయాత్రలో టచ్ చేశారు. ఆమాత్రానికే జగన్ పాదయాత్రకు జనాల్లో బ్రహ్మాండమైన స్పందన కనిపించింది. ఎనిమిది రోజులు క్రితం చిత్తూరు జిల్లాలోకి జగన్ ప్రవేశించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆదివారం ఉదయం జగన్ చంద్రగిరి నియోజకవర్గంలలో పాదయాత్ర చేశారు. ఇక్కడి ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి వైసిపినే కాబట్టి జనాలు బ్రహ్మాండంగా హాజరయ్యారు. వేలాదిమంది జగన్ యాత్రలో పాల్గొన్నారు.

పుదిపట్ల గ్రామంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి పార్టీ జెండాను ఎగరేసారు. దామలచెరువులో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో జనాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  పాదయాత్రలో జగన్ నియోజకవర్గంలోని కొంత భాగాన్ని మాత్రమే కవర్ చేసినా జనాల స్పందన మాత్రం ఎక్కువుగా కనిపించింది. పాదయాత్రలో జగన్ తో పాటు పాల్గొన్న జనాలు కూడా బాగా హుషారుగా కనిపించారు.

దామలచెరువులో జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబుపై పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. పుట్టిపెరిగిన చంద్రగిరినే చంద్రబాబు గాలికి వదిలేసినట్లు మండిపడ్డారు. చిన్నపుడు  చదువుకుని శిధిలావస్ధలో ఉన్నశేషాపురం స్కూలునే బాగు చేయని వ్యక్తి రాజధాని ఏమి కడతారంటూ ఎద్దేవా చేశారు. తన పర్యటనలో మార్కెట్ యార్డు గురించి, 100 పడకల ఆసుపత్రి బాగు గురించి కూడా హామీ ఇచ్చారు.  సాయంత్రానికి పూతలపట్టు నియోజకవర్గంలోకి ప్రవేశించారు.

loader