అమరావతి: రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం విద్య అమలు విషయంలో వెనక్కి తగ్గడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం సిద్ధంగా లేదు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటన ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం విద్య అమలుకు కట్టుబడి ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. తెలుగు మీడియం పాఠశాలలను కూడా ఏర్పాటు చేస్తామని ఆనయ చెప్పారు. 

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ విద్యావిధాన ముసాయిదా పత్రంలోని అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించినట్లు ఆయన తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అవకాశం ఉన్నంత వరకు మాతృభాష లేదా స్వదేశీ, స్థానిక భాషల్లో విద్యాబోధన చేయాలని ముసాయిదా పత్రంలో ఉందని, మాతృభాషలో బోధిస్తే పిల్లలు సులువుగా, త్వరగా నేర్చుకుంటారని ఉందని ఆయన చెప్పారు. అంతే గానీ తప్పనిసరి మాతృభాషలో బోధించాలని చెప్పలేదని ఆయన అన్నారు. 

ఒకటి నంచి ఆరో తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ మీడియాలో పాఠ్యపుస్తకాలను ప్రచురించినట్లు ఆయన తెలిపారు. ద్విభాషా పాఠ్యపుస్తకాలను ప్రచురించాలని ముసాయిదాలో ఉన్నట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 5వ తేదీన పాఠశాలలను తెరవాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. 

ఇంగ్లీష్ మీడియంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని, కేసును కొనసాగిస్తామని సురేష్ చెప్పారు. ఎస్ఈఆర్టీ సహా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నివేదికలు తీసుకున్న తర్వాతే ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. కేంద్రం నూతన విద్యావిధానాన్ని సాకుగా చూపించి ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలనే తమ నిర్ణయాన్ని వ్యతిరేకించవద్దని ఆయన కోరారు.