అమరావతి: నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది.  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా తిరిగి ఆయనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం అర్థరాత్రి ఆ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఆ మేరకు గెజిట్ విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ లో వచ్చే తుది తీర్పునకు లోబడి పదవీ పునరుద్ధరణ నోటిఫికేషన్ ఉంటుందని చెప్పారు. 

కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్ఈసీ రమేష్ కుమార్ మార్చి 15వ తేదీన నిర్ణయం తీసుకున్నారు. దానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు వైసీపీ నేతలు, మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఎస్ఈసీ పదవీ కాలాన్ని కుదిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆ తర్వాత కొత్త ఎస్ఈసీగా కనగజార్ ను నియమించింది. 

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. 

దాంతో తనను ఎస్ఈసీగా కొనసాగించకపోవడంపై రమేష్ కుమార్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. గవర్నర్ ను కలవాల్సిందిగా హైకోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సూచించింది. ఆ మేరకు రమేష్ కుమార్ గవర్నర్ హరిచందన్ ను కలిశారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ స్థితిలో నిమ్మగడ్డను తిరిగి ఎస్ఈసీగా నియమిస్తూ ప్రభుత్వం గురువారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.