Asianet News TeluguAsianet News Telugu

రూ. 161 కోట్ల అదనపు ఆదాయం: జగన్ సర్కార్ వృత్తి పన్ను పెంపు పోటు

ఆంధ్రప్రదేశ్ లో వృత్తి పన్నును పెంచుతూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వాారా రూ. 161 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

YS Jagan Govt hikes proffessional tax in Andhra Pradesh
Author
amaravathi, First Published Aug 25, 2020, 9:14 AM IST

అమరావతి: వృత్తి పన్ను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు సవరణలు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే దిశగా కొన్ని కేటగిరీలకు వృత్తి పన్నును పెంచుతూ ప్రభుత్వం సవరణ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

వృత్తి పన్నులకు చెందిన రెండు శ్లాబులకు గానూ ఓ శ్లాబులో వృత్తి పన్నును పెంపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రూ.1250 రూపాయలుగా ఉన్న వృత్తి పన్ను శ్లాబును ప్రభుత్వం రూ.2000కు పెంచింది. ఏడాదికి రూ.2500 మించకుండా వృత్తి పన్ను వసూలు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రూ.10 లక్షల లోపు టర్నోవర్‌ ఉన్న కాంట్రాక్టర్లు, పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లకు వృత్తి పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది.

10 లక్షల నుంచి రూ.25 లక్షల లోపు టర్నోవర్‌ ఉన్న కాంట్రాక్టర్లు, పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లకు రూ.2వేలు వృత్తి పన్ను విధించింది. రూ.25 లక్షలకు మించి టర్నోవర్‌ ఉన్న కాంట్రాక్టర్లు, పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లకు రూ.2500 వృత్తి పన్ను పెంచింది. అలాగే సినిమా పరిశ్రమలో పని చేసే వారికి రూ.2500 మేర వృత్తి పన్ను పెంపుదల చేసింది.

జిల్లా, రాష్ట్ర స్థాయి సహకార సంఘాలకు రూ.2500 వృత్తి పన్నును విధించింది. వీడియో లైబ్రరీ, వే బ్రిడ్జి ఆపరేటర్లకు రూ.2500 మేర వృత్తి పన్ను.... టేక్‌ ఏవే ఫుడ్‌ పాయింట్లు, కర్రీ పాయింట్లు, క్యాంటీన్లకు రూ.2500 వృత్తి పన్ను విధించింది. పబ్లిక్‌ టెలిఫోన్‌ ఆపరేటర్లకు వృత్తి పన్ను నుంచి మినహాయింపునిచ్చింది. రాష్ట్ర ఆదాయం పడిపోవడంతో పాటు వృత్తి పన్ను వసూళ్లు కూడా పడిపోవడంతో ఈ సవరణలు చేసినట్టు జీవోలో పేర్కొంది. 

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జులై నాటికి వృత్తి పన్ను వసూళ్లు 32.70 శాతం మేర తగ్గాయని సర్కార్ తెలిసింది. సంక్షేమ పథకాల అమలుకు నిధుల అవసరమవుతుందని...అందుకు పెంపు తప్పడం లేదంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని జీవోలో స్పష్టం చేసింది. 

వృత్తి పన్ను పెంపు ద్వారా రూ.161 కోట్ల మేర అదనపు ఆదాయాన్ని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా రూ.213.80 కోట్లు, రూ.221.80 కోట్లు, రూ.231.68 కోట్ల మేర వృత్తి పన్ను వసూలు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios