అమరావతి: ఇసుక రవాణా విధానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇసుక రావాణా టెండర్లను రద్దు చేసింది. గనుల శాఖ శుక్రవారం అర్థరాత్రి ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

కిలోమీటరు ఇసుక తరలింపునకు అతి తక్కువ ధర కోట్ చేశారనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం ఇసుక రవాణా టెండర్లను రద్దు చేసింది. జిల్లాకు ఒకే కాంట్రాక్టర్ ఉంటే ఇబ్బందులు వస్తాయని భావించి ఆ విధానాన్ని జగన్ ప్రభుత్వం మార్చింది. 

జిపిఎస్ ఉన్న ట్రక్కు యజమానులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. కిలోమీటరుకు రూ.4.90 ధర నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక నేపథ్యంలో ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు విజిలెన్స్ అధికారులతో పాటు డీజీపి కూడా నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం ఇసుక విధానాన్ని ప్రకటించడంతో ఇసుక కొరత ఏర్పడి నిర్మాణాలు ఆగిపోయాయని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.