ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రతమత్తమయ్యాయి. కరోనా వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు స్కూళ్లు, కాలేజీలను మూసివేయడంతో పాటు షాపింగ్ మాల్స్‌ను క్లోజ్ చేస్తున్నారు.

మరోవైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసు వెలుగు చూడటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో జగన్ సర్కార్ అప్రమత్తమైంది. కరోనా వైరస్ అనుమానిత వ్యక్తులకు అవసరమైతే నిర్బంధ వైద్య చికిత్స అందిస్తామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ వెల్లడించారు.

Also Read:కరోనా ఎఫెక్ట్: భారత్, దక్షిణాఫ్రికా సిరీస్ రద్దు

దీనితో పాటు ‘‘ఎపిడమిక్ డిసీజెస్ చట్టం-1987’’ను అమల్లోకి తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ చట్టం ద్వారా వ్యాధి తీవ్రత పెరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టడానికి వీలు కలుగుతుంది.

1897లో బాంబే రాష్ట్రంలో ప్లేగు వ్యాధి నివారణకు నాటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు ప్రతిరోజూ సేకరిస్తున్నట్లు జవహర్ రెడ్డి వెల్లడించారు.

సినిమా హాళ్లు, మాల్స్ వద్ద సూచనలు పాటించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నెల్లూరులో కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఇటలీ నుంచి వచ్చాడని.. కరోనా నిర్ధారణ అయ్యాక వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

Also Read:కరోనా దెబ్బ: ఐపీఎల్ వాయిదా...కొత్త ఆరంభ తేదీ ఇదే!

రాష్ట్రంలో 55 మంది అనుమానితులకు పరీక్షలు పంపించగా... వాటిలో 47 మంది రిపోర్ట్‌లు నెగటివ్‌గా వచ్చాయన్నారు. మరో 8 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని జవహర్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు గాను త్వరలో విజయవాడలోనూ కరోనా ల్యాబ్ అందుబాటులోకి వస్తుందని జవహర్ రెడ్డి తెలిపారు.

విజయవాడలో 60 బెడ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మరోవైపు భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు 81కి చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో అత్యధికంగా కేరళలో 19 కేసులు నమోదయ్యాయి.