అవిశ్వాస తీర్మానం విషయంలో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లను ఇరికించేసారు. ప్రత్యేకహోదా కోసం తాము ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి ఎంపిల మద్దతు కూడగట్టే బాధ్యత పవన్, చంద్రబాబులే తీసుకోవాలన్నారు. అదేవిధంగా అవిశ్వాసతీర్మానానికి టిడిపిలోని 20 మంది ఎంపిల మద్దతు విషయంలో కూడా పవన్ బాధ్యత తీసుకోవాలని చెప్పారు.

ప్రత్యేకహోదా కోసం వైసిపి కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. అందులో భాగంగానే తాళ్ళూరు మండల కేంద్రం నుండి వైసిపి నేతలు ఢిల్లీకి బయలుదేరారు. నేతల వాహనాలను పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి మరీ పంపించారు. అంతుకుముందు తాళ్ళూరులోనే ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో జగన్ సమావేశమయ్యారు. మార్చి 5వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు జగన్ పిలుపిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

అందులో భాగంగానే శనివారం మధ్యాహ్నం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు సీనియర్ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ధర్నా చేయటంతో పాటు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ చర్చించారు. మార్చి 1వ తేదీన జిల్లా కలెక్టరేట్ల ముందు జరిగిన ఆందోళనలు సక్సెస్ అయిన విషయంపై జగన్  నేతలను అభినందించారు.

మార్చి 1న కలెక్టరేట్ల ముందు ఆందోళనలు, 5వ తేదీన జంతర్ మంతర్ వద్ద ధర్నా, 6వ తేదీ నుండి పార్లమెంటులో నిరసనలు, ఏప్రిల్ 6వ తేదీన లోక్ సభ సభ్యుల రాజీనామాలు విషయంపై జగన్ డైరెక్షన్ ఇచ్చారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన సమావేశం తర్వాత నేతలు వాహనాల్లో విజయవాడకు బయలుదేరారు. అక్కడి నుండి వెళ్ళగలిగిన వారు విమానాల్లోనూ మిగిలిన నేతలు ప్రత్యేక రైల్లోనూ ఢిల్లీకి బయలుదేరారు.