తణుకు: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పశ్చిమగోదావరి జిల్లా యాసలో  బాబు పాలనపై పిట్టకథను విన్పించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా  పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మంగళవారం నాడు జరిగిన సభలో  వైఎస్ జగన్ బాబుపై సెటైర్లు వేశారు.

విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో బాబు  తాను ఉంగరాలు ధరించనని, గడియారం కూడ పెట్టుకోనని  నిరాడంబరంగా జీవనం సాగిస్తానని బాబు  చేసిన వ్యాఖ్యలపై జగన్ వ్యంగ్యాస్త్రాలను సంధించారు.

తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో తనకు ఓ వ్యక్తి కలిసి బాబు నిరాడంబరంగా  ఉంటున్న విషయమై తనకు ఓ కథ చెప్పారని జగన్ చెప్పారు. ఈ కథను ఆ సభలో విన్పించారు.
చంద్రబాబునాయుడు చేతి వేళ్ళకు ఉంగరాలు లేకున్నా ఓటుకు నోటు కేసులో  ఎమ్మెల్యేల కొనుగోలు కోసం  డబ్బులు వస్తాయన్నారు. ఏపీ రాష్ట్రంలో కూడ  ఇతర పార్టీల నుండి టిడిపి లో చేరిన ఎమ్మెల్యేలకు రూ. 20 కోట్లు ఎలా వచ్చాయని  ఆయన ప్రశ్నించారు.  

చంద్రబాబునాయుడు నిప్పు అని చెప్పుకొంటారని జగన్ ఎద్దేవా చేశారు. కానీ, బాబుపై ఉన్న కేసులపై స్టే కొసాగుతూనే ఉంటాయన్నారు. ఆ స్టేలు  మాత్రం  ఎత్తివేయరన్నారు.చంద్రబాబునాయుడు ఏ అమ్మాయి వంక చూడరని చెప్పుకొన్నాడన్నారు. కానీ, రాష్ట్రంలో స్త్రీలపై అఘాయిత్యాలు చోటు చేసుకొంటే ఎందుకు నోరు మెదపడం లేదని  జగన్ ప్రశ్నించారు.

చంద్రబాబునాయుడు తాను మద్యం తాగనని చెప్పుకొన్నారని, కానీ, వీధికో బెల్గ్‌షాపు పెట్టి  ప్రజలను మద్యానికి బానిసలుగా చేస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడు ఏ ఒక్కరినీ మోసం చేయలేదని ఆయన చెప్పుకొన్నారని గుర్తు చేశారు. అయితే బాబు ఎవరినీ మోసం చేయలేదు కానీ, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీలను మాత్రం అమలు చేయలేదని బాబుపై జగన్ విమర్శలు గుప్పించారు.