కడప: దివంగత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 69వ జయంతి వేడుకలను కడప జిల్లా ఇడుపులపాయలో ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు.వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి, సోదరి వైఎస్‌ షర్మిల, ఈసీ గంగిరెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులు వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.

వైఎస్ జయంతిని పురస్కరించుకొని  ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మాట్లాడారు. ప్రజలు రాజన్న రాజ్యం కావాలని కోరుకొంటున్నారని ఆమె చెప్పారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా వైఎస్ జగన్ కూడ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొంటున్నారని ఆమె చెప్పారు.

ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వైఎస్ చేసిన సంక్షేమ పథకాలు ఆయనను పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయేలా చేసిందని  విజయమ్మ గుర్తు చేసుకొన్నారు. 

ప్రజలు వైఎస్ జగన్ కు మద్దతుగా నిలుస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వైఎస్ జయంతిని పురస్కరించకొని వైఎసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.