కృష్ణాకు ఎన్టీఆర్ పేరు: జగన్ పై అనూహ్యమైన తిరుగుబాటు

YS Jagan faces opposition on Krishna district name change
Highlights

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడుతామని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనకు అనూహ్యమైన వ్యతిరేకత ఎదురైంది.

విజయవాడ: కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడుతామని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనకు అనూహ్యమైన వ్యతిరేకత ఎదురైంది. జగన్ హామీని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజకీయ సలహాదారు దుట్టా రామచంద్రరావు వ్యతిరేకించారు. 

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే ఎట్టి పరిస్థితిలో కూడా అంగీకరించబోమని ఆయన అన్నారు. జగన్ తన హామీని ఉపసంహరించుకోకపోతే రాజీనామా చేసి కృష్ణా పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి ఉద్యమిస్తామని ఆయన చెప్పారు. 

కృష్ణానది ఎన్నో రాష్ట్రాలను దాటుకుని కృష్ణా జిల్లా డెల్టా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తూ ఎంతో మందికి జీవనాధారంగా మారిందని, అందువల్ల కృష్ణా జిల్లా పేరు మారిస్తే సహించబోమని అన్నారు. 

ఇదిలావుంటే, వైఎస్ జగన్ హామీపై తెలుగుదేశం పార్టీ నాయకులు అప్రమత్తమైనట్లు కనిపిస్తున్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని తాము ఎప్పుడో నిర్ణయం తీసుకున్నామని వారంటున్నారు. జిల్లాలు పెరిగిన తర్వాత నిమ్మకూరు ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చెప్పారు. 

చంద్రబాబు ధర్మపోరాటం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే వైసిపి నయవంచన దీక్షలు చేస్తోందని అన్నారు. విజయసాయిరెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు రూ.3 లక్షల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారని అంటూ అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంతో విజయసాయిరెడ్డికి తెలుసా అని ఆయన అడిగారు. 

loader