విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైయస్ జగన్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసంతకం చేసిన తర్వాత ప్రజలకు వరాలజల్లు కురిపించారు. 

అనంతరం తనకు ఇంతటి ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు అభివాదం తెలిపారు. ఈ సందర్భంగా తన తండ్రి దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డిని తలచుకున్నారు. ఆయన ఆశీస్సులు, దేవుడు ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులకు ధన్యవాదాలు తెలిపారు. 

ఈ సందర్భంగా ఆకాశమంతటి విజయం అందించిన ప్రజలకు పాదాభివందనం చేశారు. అనంతరం తనకు జన్మనిచ్చిన పైన ఉన్న తండ్రి దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి, తల్లి వైయస్ విజయమ్మకు పాదాభివందనం చెప్పారు. 

దీంతో ఒక్కసారిగా వైయస్ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం వైయస్ జగన్ ను హత్తకుని వైయస్ విజయమ్మ ఆనందంతో పరవశించిపోయారు. ఆనంద బాష్పాలతో కన్నీటి పర్యంతమయ్యారు. తల్లి కన్నీరును వైయస్ జగన్ తుడిచి ఆమెను ఓదార్చారు. ఈ వేదికపై నెలకొన్న ఉద్విగ్న క్షణాలు చూసి అంతా భావోద్వేగానికి గురయ్యారు.