ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించిన 70 రోజుల్లో వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమను చుట్టేశారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ రాష్ట్రంలో 3వేల కిలోమీటర్లు పాదయాత్ర మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. పోయిన ఏడాది నవంబర్ 6వ తేదీన కడప జిల్లాలోని ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభమైంది. మొత్తం మీద అన్ని జిల్లాల్లోనూ పాదయాత్రకు జనాల స్పందన బాగానే కనబడింది.

ముందుగా కడపజిల్లాలో 6 నియోజకవర్గాలు కవర్ చేశారు. తర్వాత కర్నూలు జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. అక్కడి నుండి అనంతపురం జిల్లాలో తిరిగారు. కడప జిల్లా అంటే సొంత జిల్లా కాబట్టి జనాలు బాగానే స్పందించారనుకున్నా కర్నూలు జిల్లాలో కూడా జనాల స్పందన బాగానే వచ్చింది. అదే విధంగా అనంతపురం జిల్లాలో చూస్తే కర్నూలు జిల్లాను మించి స్పందన ఇక్కడ కనబడింది.

ఈ జిల్లాలోకి ప్రవేశించే ముందు జనస్పందన ఎలాగుంటుందో అని వైసిపి నేతలు ఆందోళన పడ్డారు. అయితే స్పందన చూసి ఆశ్చర్యపోయారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో పోయిన ఎన్నికల్లో వైసికి వచ్చింది 2 సీట్లు మాత్రమే. అందుకే నేతలు ఆందోళన పడ్డారు. అయితే, యాత్ర ప్రారంభమైన తర్వాత వారి ఆందోళన కాస్తా ఆనందంతో నిండిపోయింది. ఎందుకంటే, కడప, కర్నూలు జిల్లాలకు మించి అనంతపురం జిల్లాలో జనస్పందన కనబడింది.

అదే ఊపులో చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోకి ప్రవేశించారు. ఈ జిల్లాలో కూడా 10 నియోజకవర్గాల్లో పర్యటించారు. మంగళవారానికి జగన్ రాయలసీమ పర్యటన పూర్తవుతుంది. మొత్తం మీద సుమారు 950 కిలోమీటర్ల పాదయాత్రను రాయలసీమలో దిగ్విజయంగా పూర్తి చేశారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలో 53 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో సుమారుగా  30 నియోజకవర్గాలను జగన్ కవర్ చేశారు. ముందే చెప్పినట్లుగా మిగిలిన నియోజకవర్గాలను బస్సుయాత్రలో కవర్ చేస్తారు.

పాదయాత్రలో భాగంగానే జగన్ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించటం విశేషం. కర్నూలు జిల్లాలోని ప్రత్తికొండ అభ్యర్ధిగా చెఱుకులపాడు నారాయణరెడ్డి భార్య శ్రీదేవీరెడ్డిని ప్రకటించారు. తర్వాత చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం అభ్యర్ధిగా చంద్రమౌళిని ప్రకటించారు. తర్వాత కర్నూలు జిల్లాలోనే కర్నూలు అసెంబ్లీ అభ్యర్ధిగా హఫీజ్ ఖాన్ ను ప్రకటించారు. అంటే ప్రత్తికొండలో రెడ్డి, కుప్పంలో బిసి, కర్నూలులో ముస్లిం సామాజికవర్గాలకు చెందిన అభ్యర్ధులను ప్రకటించటం గమనార్హం.