నడిచి వెళ్తున్న వలస కూలీలను చూసి చలించిపోయా: వైఎస్ జగన్
ఎండల్లో చిన్నారులతో కలిసి ఎండల్లో నడిచి వెళ్తున్న వలస కూలీలను చూసి తాను చలించిపోయానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. వలస కూలీలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని ఆదేశించారు.
అమరావతి: ఎండల్లో చిన్నారులతో కలిసి నడిచి వెళ్తున్న వలస కూలీలను చూసి చలించిపోయానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రోటోకాల్స్ ప్రకారం వారిని బస్సుల్లో ఎక్కించుకోవాలని, టికెట్లు అడగవద్దని ఆయన అన్నరు. కరోనా నివారణ చర్యలపై, లాక్ డౌన్ నేపథ్యంలో ఆంక్షల సడలింపుతో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన శనివారం ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించారు.
వలస కూలీలకు ప్రోటోకాల్స్ పాటిస్తూ 15 రోజుల పాటు ఉచిత ప్రయాణం కల్పించాలని, నడిచివెళ్తున్న వలస కూలీలు కనిపిస్తే బస్సుల్లో ఎక్కించుకుని సరిహద్దుల వరకు దించాలని ఆయన ఆదేశాంచారు. ఎపీ నుంచి వెళ్తున్న వలస కూలీలపై ఉదారత చూపాలని ఆయన చెప్పారు.
బస్సుల్లో పాటించాల్సిన ప్రోటోకాల్స్ ను తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎన్ఓసీలు తయారు చేయాలని చెప్పారు. కరోనా నివారణ చర్యలు చేపడుతూ కార్యకలాపాలు సాగించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా వైద్యానికి వచ్చేట్లు చూడాలని అన్నారు.
రెస్టారెంట్లు, మాల్స్ ల్లో తిరిగి కార్యక్రమాలు అమలు చేయడానికి తగిన ప్రణాళికలు కూడా రూపొందించాలని ఆయన సూచించారు. లాక్ డౌన్ ఎగ్జిట్ నేపథ్యంలో వైద్యపరంగా అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన చర్చించారు. క్రమంగా వాటిలో కార్యకలాపాలు ప్రారంభించాలని ఆయన అన్నారు.