తెలంగాణ ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జరిగిన బహిరంగసభలో జగన్ ప్రసంగించారు.

కాంగ్రెస్, టీడీపీల అనైతిక పొత్తుకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పని... ఏం చెప్పినా నమ్ముతారు... ఎన్ని అబద్ధాలు చెప్పినా ఓట్లేస్తారు అనుకునే నేతలకు జనం సరైన బుద్ధి చెప్పారని జగన్ అన్నారు. ‘‘భస్మాసురుడు చేయి పెట్టినా.. చంద్రబాబు కాలు పెట్టినా అంతా బూడిదేనని ఆయన సెటైర్లు వేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు దేశ ప్రజలకు కూడా చంద్రబాబు గురించి అర్థమైపోయిందన్నారు.. ‘‘తెలంగాణ ఎన్నికల తీరును పరిశీలిస్తే చంద్రబాబు యుద్ధం చేస్తున్నారా..? లేక ఆయన కోసం మీడియా యుద్ధం చేస్తోందో అని అర్ధం కానీ పరిస్థితి నెలకొందన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు అవినీతిపై కాంగ్రెస్ పార్టీ ‘‘ఛార్జిషీట్’’ అనే పేరుతో పుస్తకం వెలువరించింది. దీనిపై రాహుల్ గాంధీ ఫోటోను ముద్రించారు. అయితే తెలంగాణ ఎన్నికలకు వచ్చేసరికి రాహుల్, చంద్రబాబు ఒకే వేదికపై పక్క పక్క కూర్చొన్నారు.

వీరి రాజకీయాలను ప్రజలు ఎలా నమ్మి ఓట్లు వేస్తారని జగన్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ముందు చంద్రబాబు టీఆర్ఎస్‌తో పొత్తు కోసం ప్రయత్నించారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రవిభజన పాపం కాంగ్రెస్‌దేనని, దాన్ని బతకనివ్వకూడదన్న చంద్రబాబు అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. చంద్రబాబు ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చారని జగన్ ఆరోపించారు.

తెలంగాణ ఎన్నికలకు 36 గంటల ముందు లగడపాటిని నిల్చోబెట్టి ప్రజాకూటమి గెలుస్తుందని చెప్పించారు.. ఈ పరిణామాం చూసి తనకు ఆశ్చర్యం కలిగిందన్నారు. తెలంగాణ పోలీసులు పట్టుకున్న రూ.142 కోట్ల డబ్బంతా ఆంధ్రా ప్రజల జేబుల్లోంచి లూటీ చేసి తెచ్చినదే అంటూ జగన్ మండిపడ్డారు.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు ఓటమి తప్పదన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. కాంగ్రెస్-టీడీపీ పొత్తును తెలంగాణ ప్రజలు తిరస్కరించారన్నారు. బాబు దోపిడిని కక్కిస్తే ప్రతి కుటుంబానికి రూ.20 లక్షలు పంచవచ్చని, ఆయన కబ్జా చేసిన భూములను వెనక్కి తీసుకుంటే ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమిని ఉచితంగా ఇవ్వొచ్చని విజయసాయిరెడ్డి తెలిపారు. నాయకులు దారి తప్పినా ప్రజలు మంచి తీర్పును ఇచ్చారని, ఏపీ ప్రజలు కూడా త్వరలోనే బాబుకు బుద్ధి చెబుతారని విజయసాయి స్పష్టం చేశారు.