ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో ప్రజలనుద్దేశించి మాట్లాడిన వైసీపీ అధినేతన జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై సెటైర్లు వేశారు.. బాబు తానా అంటే తంధానా అనే పచ్చమీడియా.. ఆయన ఢిల్లీకి వెళుతున్నారు.. మోడీని అడిగేస్తారు.. కడిగేస్తారని ఊదరగొట్టారని.. కానీ జరిగిన కథేంటో అందరం చూశామన్నారు.. సెకండ్ ఇస్తూ.. వంగి వంగి ప్రధానికి దండాలు పెట్టారని జగన్ ఎద్దేవా చేశారు..

మహాభారతంలో ఉత్తరకుమారుడు కూడా కౌరవుల మీద యుద్ధం చేయడానికి వెళుతున్నానని.. తలపాగాలు తీసుకొస్తానని చెబుతాడు.. తరువాత ఉత్తరకుమారుడి పరిస్థితి ఏమైంది.. కౌరవ సైన్యాన్ని చూసి.. వణికిపోయి రథాన్ని విడిచిపెట్టి పారిపోతాడు.. అచ్చం చంద్రబాబు కూడా అలాగే చేశారని జగన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నట్లు బిల్డప్ ఇస్తారు.. బీజేపీని తిడతారు.. కానీ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్‌ను పక్కన పెట్టుకుంటారని.. బీజేపీ నేత భార్యకు టీటీడీ బోర్డ్ మెంబర్‌గా పదవిని కట్టబెడతారని ధ్వజమెత్తారు..

చంద్రబాబు సీఎం అయ్యాకా కోనసీమలో కొబ్బరికి రేటు పడిపోయిందని.. నాడు నగరంలో గ్యాస్ లీకేజీ బాధితులను ఆదుకుంటానని చెప్పి ఇంతవరకు పట్టించుకోలేదన్నారు.. మట్టిని, ఇసుకను, కాంట్రాక్టులను, రాజధానిలో భూములను చివరకు దేవుడిని కూడా టీడీపీ ప్రభుత్వం వదలడం లేదన్నారు. తమ ప్రభుత్వం వస్తే.. నగరం గ్యాస్ లీకేజ్ బాధితులను ఆదుకుంటానని.. నాలుగు లంక గ్రామాలను కలిపేందుకు దగ్గరుండి బ్రిడ్డి కట్టిస్తానని చెప్పారు.