అమరావతి: అవినీతికి  దూరంగా ఉండాలని  తన మంత్రివర్గ సహచరులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. గత ప్రభుత్వ హయంలో  జరిగిన కుంభకోణాలను వెలికితీసిన అధికారులు, మంత్రులను సన్మానం చేస్తానని జగన్ చెప్పారు.

అవశేష ఆంధ్రప్రదేశ్  సీఎం‌గా వైఎస్ జగన్  నేతృత్వంలోని కేబినెట్ తొలి సమావేశం సోమవారం నాడు జరిగింది. సుమారు ఆరు గంటల పాటు  కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులకు జగన్ పలు సూచనలు చేశారు.

అవినీతికి దూరంగా ఉండాల్సిందిగా కోరారు. పారదర్శకంగా ఇసుక విధానాన్ని  తీసుకురానున్నట్టు కేబినెట్ సమావేశంలో జగన్ ప్రకటించారు. టీడీపీ హయంలో ఉన్న ఔట్ సోర్సింగ్  ఏజెన్సీలను  రద్దు చేయనున్నట్టు  సీఎం తెలిపారు.అంతేకాదు టీడీపీ హయంలోని అన్ని నామినేటేడ్ పదవులను రద్దు చేస్తామన్నారు. ఈ మేరకు ఆర్డినెన్స్‌ను తీసుకువస్తామని జగన్ ప్రకటించారు.

ప్రతి ఏటా ఆరు లక్షల ఇళ్లను నిర్మించనున్నట్టు  వైఎస్ జగన్ కేబినెట్ సమావేశంలో  ప్రకటించారు.  వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ నుండి అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్నట్టు జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులు అమ్మఒడి పథకానికి అర్హులని ఆయన చెప్పారు.వివోఓలకు రూ.3 నుండి రూ.10 వేలకు, ఆర్బీఏలకు రూ.3 నుండి రూ. 10 వేలకు వేతనాలను పెంచుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది.

సంబంధిత వార్తలు

సుదీర్ఘంగా సాగిన జగన్ తొలి కేబినెట్ భేటీ: కీలక నిర్ణయాలకు ఆమోదం