అమరావతి: పోలవరం ప్రాజెక్టు వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వాన్ని నిందించారు. గత ప్రభుత్వ తీరు వల్లనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో గందరగోళం ఏర్పడిందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ పనుల్లో గత ఐదేళ్లలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీతో ఆయన శనివారం సమావేశమయ్యారు. 

పోలవరం ప్రాజెక్టు తనకు అత్యంత ప్రధానమైందని జగన్ చెప్పారు. వరదలు వస్తే నాలుగు నెలల పాటు పోలవరం ప్రాజెక్టు పనులు జరగవని, ఈ గందరగోళం గత ప్రభుత్వం వల్లనే ఏర్పడిందని ఆయన అన్నారు. నీటి పారుదుల ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆయన నిపుణుల కమిటీని ఆదేశించారు. 

ప్రాధాన్యతా క్రమంలో హంద్రీనీవా, వెలిగొండ తదితర ప్రాజెక్టులను సమీక్షించాలని, ముందుగా పోలవరం ప్రాజెక్టును సమీక్షించాలని ఆయన సూచించారు. వరద సీజన్ ముగిసిన వెంటనే పోలవరం ప్రాజెక్టును సమీక్షించాలని ఆయన చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణాల్లో అవినీతి జరగడానికి వీలు లేదని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా తాను అవినీతిని సహించబోనని చెప్పారు. 

ఈ రోజు ఇలాంటి కుంభకోణాలను తాను సహించబోనని చెప్పారు. రాష్ట్రం తీవ్ర నష్టాల్లో ఉందని, గత ప్రభుత్వంలోని అవినీతి వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. పోలవరంతో సహా ఇతర ప్రాజెగక్టుల్లో రివర్స్ టెండరింగ్ కు ఏ మాత్రం అవకాశం ఉందో పరిశీలించాలని ఆయన నిపుణుల కమిటీని ఆదేశించారు. పదిహేను రోజుల తర్వాత మరోసారి నిపుణుల కమిటీతో ఆయన సమావేశం కానున్నారు. 

ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి విపరీతంగా పెరిగిందని, కళ్లు మూసుకోండని తనపైనా ఒత్తిడి తెచ్చారని జగన్ అన్నారు. అలా చేయదల్చుకోలేదు కాబట్టే అవినీతిపై పోరాటానికి సిద్ధమయ్యానని వెల్లడించారు.  రూ.100 పని రూ.80కే జరుగుతుందంటే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్దామని ఆయన చెప్పారు. మన ప్రభుత్వంలోని పారదర్శకత దేశానికి ఒక సంకేతం పంపాలని, పారదర్శకత కోసమే జ్యుడీషియల్‌ కమిషన్‌, రివర్స్‌ టెండరింగ్ ఆయన అన్నారు.
 
పోలవరంలో అవకతవకలను జగన్‌ ప్రస్తావించారు. పోలవరం పనుల్లో అక్రమాలపై నిగ్గు తేల్చాలని నిపుణుల కమిటీకి ఆదేశించారు.  స్పిల్‌వే పూర్తి చేయకుండా కాఫర్ డ్యాం పనులు చేపట్టడంతో గోదావరిలో వెడల్పు తగ్గి వరదలు వస్తే 4 నెలలు కూడా పని కొనసాగించలేదని పరిస్థితి ఏర్పడిందని, ఇది గత ప్రభుత్వ నిర్వాకం వల్లే జరిగిందని అన్నారు. 

సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ), రహదారులు, భవనాల శాఖ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖలు చేపట్టిన ఇంజనీరింగ్‌ పనుల్లో అక్రమాలపై విచారణ కోసం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 8 మంది సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ జూన్‌ 14న జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ జరిపి, 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని నిపుణుల కమిటీకి నిర్దేశించారు.