టిడిపికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జగన్

First Published 30, Apr 2018, 11:40 AM IST
YS Jagan announces Krishna district will be named after NTR
Highlights

కుల కోటలకు బీటలు తప్పవా ???

ఆంధ్రాలో అధికార తెలుగుదేశం పార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు ప్రతిపక్ష నేత జగన్. కృష్ణా జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. కృష్ణా జిల్లాలోని ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో జగన్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా వైసిపి అధికారంలోకి రాగానే కృష్ణా జిల్లా పేరు మార్చి ఎన్టీఆర్ జిల్లాగా మారుస్తామని ప్రకటించారు.

ఈ ప్రకటన రాజకీయవర్గాలను షేక్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉంది. అయినా ఆ పార్టీకి కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న ఆలోచన రాలేదు. కనీసం ఆ దిశగా ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు.

ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ చేసిన ఈ ప్రకటన తెలుగుదేశం పార్టీని షేక్ చేయడం ఖాయమంటున్నారు. ఒకవైపు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయనను దింపి పారేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని గతంనుంచీ అటు వైఎస్ రాజశేఖరరెడ్డి కానీ, ఇటు జగన్ కానీ పదే పదే ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఎన్టీఆర్ మీద అంతగా ప్రేమ లేదన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ మెంట్ చేసే ప్రయత్నం చేశారు వైఎస్ కానీ, జగన్ కానీ. ఒక దశలో చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఫొటోలను ఎక్కడా వాడకుండా చేయాలన్న కుట్ర చేసినట్లు కూడా వైసిపి గతం నుంచీ ఆరోపిస్తూనే ఉంది.

తాజాగా జగన్ చేసిన ప్రకటన సరికొత్త చర్చను లేవనెత్తింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసిపి అంటే రెడ్ల పార్టీ అని, టిడిపి అంటే కమ్మ పార్టీ అన్న ముద్ర ఉంది. కానీ కమ్మలంతా టిడిపికి లేకుండా చేయడం కోసం వైసిపిఈ స్టెప్ తీసుకుందా అన్న చర్చ ఉంది. ఎందుకంటే కమ్మల్లో ఎన్టీఆర్ అభిమానులంతా టిడిపి పక్షాన లేరనే చెప్పాలి. ఈ నేపథ్యంలో చంద్రబాబును వ్యతిరేకించే కమ్మలందరినీ జగన్ అక్కున చేర్చుకునే ప్రయత్నంగా చెబుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ను అభిమానిస్తూ.. చంద్రబాబుకు వ్యతిరేకులుగా ఉన్న కమ్మ కులస్థులందరినీ ఆకర్షించే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రకటన చేసి ఉండొచ్చని చెబుతున్నారు.

మొత్తానికి చంద్రబాబుకు రాని ఆలోచన జగన్ చేయడం మాత్రం అధికార తెలుగుదేశం పార్టీకి షాకింగ్ న్యూస్ గానే చెప్పవచ్చంటున్నారు.

loader