మొత్తానికి మొదటిసారి చంద్రబాబునాయుడుపై వైసిపి పై చేయి సాధించింది. రాజ్యసభ ఎన్నికల నేపధ్యంలో చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకరిపై మరొకరు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పాదయాత్రలో బిజీగా ఉన్న జగన్ తరపున రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అంతా తానే అయి వ్యూహాలు రచించారు.

ఇప్పటికే 22 మంది ఫిరాయింపులను లాక్కున్న చంద్రబాబు ఈనెల 23వ తేదీన జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో జగన్ ను దెబ్బ కొట్టాలని ప్లాన్ వేశారు. భర్తీ కావాల్సిన మూడు స్ధానాల్లో రెండు టిడిపికి, ఒకటి వైసిపికి దక్కుతుంది. అయితే, వైసిపికి దక్కాల్సిన ఒక్క స్ధానాన్ని కూడా దక్కనీయకూడదని చంద్రబాబు అనుకున్నారు.  

తమకు అలవాటైన ఫిరాయింపులను ప్రోత్సహించటం ద్వారా జగన్ ను దెబ్బ కొట్టాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫిరాయింపులకు గాలం వేయటం కూడా మొదలైంది. అయితే, ఇక్కడే టిడిపి తప్పులో కాలేసింది. ఎలాగంటే, చంద్రబాబు వ్యూహాలను జగన్, విజయసాయి ముందుగానే పసిగట్టి అలర్టయ్యారు.

 ఎప్పుడైతే, ఫిరాయింపులకు గాలంవేయటం మొదలుపెట్టారో వెంటనే ఆ విషయం తమకు తెలిసే ఏర్పాట్లు చేసుకున్నారు. అందుకనే విజయనగరం జిల్లా సాలూరు ఎంఎల్ఏ పీడిక రాజన్నదొరకు ఫోన్ రాగానే వెంటనే ఆ విషయం జగన్, విజయసాయికి తెలిసిపోయింది. అంతేకాకుండా రాజన్నదొరతో ఓ మంత్రి మాట్లాడిన ఫోన్ సంభాషణల మొత్తాన్ని రికార్డు కూడా చేశారు.

అదేవిధంగా మరో ఇద్దరు ఎంఎల్ఏలకు-మంత్రులకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు కూడా రికార్డయ్యాయి. అవన్నీ విజయసాయి వద్దకు చేరాయి. అంతకుముందు టిడిపి ఎంపి టిజి వెంకటేష్ తమ ఎంఎల్ఏలతో మాట్లాడారంటూ కొన్ని టేపులను ఎన్నికల కమీషన్ కు అందించారు.

ఫిరాయింపలను ప్రోత్సహిస్తున్న విషయం ఎప్పుడైతే బయటపడిందో చంద్రబాబుకు ఇబ్బందైంది. దానికితోడు కేంద్రమంత్రి వర్గం నుండి బయటకు వచ్చేయటం, ప్రత్యేకహోదా కోసం ఆందోళనల నేపధ్యంలో ఏం చేయాలో చంద్రబాబుకు దిక్కుతోచలేదు. సాహసం చేసి మూడో అభ్యర్ధిని పెట్టినా గెలుపు అంత సులభం కాదన్న విషయం అర్ధమైపోయింది. దాంతో చేసేదిలేక ఇద్దరు అభ్యర్ధులనే పోటికి పెట్టాలని డిసైడ్ అయ్యారు. దాంతో మైండ్ గేమ్ లో చంద్రబాబుపై జగన్, విజయసాయిదే పై చేయి అయినట్లైంది.