అమరావతి:: ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, సమాచార సాంకేతిక, నైపుణ్యాభివృద్ది, శిక్షణ విభాగం వంటి వివిధ మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్న మేకపాటి గౌతమ్ రెడ్డి ఖాతాలోకి మరో రెండు విభాగాలు చేరారు. అతడిపై నమ్మకంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో రెండు విభాగాలను ఆయనకు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

ఇప్పటికే వివిధ శాఖల బాధ్యతలను చూస్తున్న మేకపాటికే రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖలను కూడా అప్పగించింది జగన్ సర్కార్. ఈ మేరకు ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇలా మేకపాటికి అదనపు శాఖతను కేటాయించడం ఇది రెండోసారి. ఏపిలో వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్ తన కేబినెట్ లో మేకపాటి గౌతమ్ రెడ్డికి చోటు కల్పించారు. అతి ముఖ్యమైన పరిశ్రమలు, వాణిజ్యం, సమాచార సాంకేతిక విభాగాలను అప్పగించారు. ఆ తర్వాత ఇటీవలే మరో రెండు విభాగాలను కూడా అప్పగించారు. నైపుణ్య అభివృద్ధి, శిక్షణా విభాగాన్ని మంత్రి మేకపాటికి కేటాయిస్తూ వైసిపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  

తాజాగా రెండోసారి మేకపాటికి పెట్టుబడులు, మౌలిక వసతుల విభాగాలను కూడా అప్పగించారు. దీన్నిబట్టి  మంత్రిగా మేకపాటి పనితీరు పట్ల సీఎం జగన్ సంతృప్తిగా వున్నట్లు అర్థమవుతోంది. అందువల్లే ఇతర శాఖల బాధ్యతలు కూడా ఆయనకు అప్పగిస్తున్నారు.  నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు మేకపాటి.