Asianet News TeluguAsianet News Telugu

ప్రశాంత్ కిషోర్ సర్వేలతో జగన్ అలర్ట్: నేతలకు హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు పక్కా వ్యూహంతో మందుకు వెళ్తున్నారు. నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరుపై సర్వేలు చేయిస్తున్నారు. 
 

ys jagan alert on prasanth kishore team survey
Author
Ongole, First Published Dec 12, 2018, 4:45 PM IST

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు పక్కా వ్యూహంతో మందుకు వెళ్తున్నారు. నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరుపై సర్వేలు చేయిస్తున్నారు. 

సర్వే నివేదిక ఆధారంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఏయే నియోజకవర్గాల్లో ఇంచార్జ్ పరిస్థితి పెర్ఫార్మెన్స్ బాగోలేకపోతే వారిని నిర్మోహమాటంగా తప్పిస్తున్నారు వైఎస్ జగన్. తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం నివేదిక జగన్ చేతికి వచ్చింది. 

దీంతో ఆయా నియోజకవర్గాల ఇంచార్జ్ ల జాతకాలు తీసుకున్న జగన్ వారితో మాట్లాడారు. పనితీరు ఆధారంగా వారికి పీకే టీం ఇచ్చిన జాతకం అందజేశారు. అభ్యర్థులకు నివేదిక ఇచ్చి నియోజకవర్గంలో సవివరంగా పరిస్థితులను వివరించాం. 

ఇంచార్జ్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ సామాజికవర్గంలో బలం పెంచుకోవాలో సూచించారు. అవసరమైన చర్యలు తీసుకోండి. మళ్లీ సర్వే నాటికి మార్పు రాకపోతే మేమే మార్చేస్తాం అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి నియోజకవర్గాల ఇంచార్జ్ లకు వార్నింగ్ ఇచ్చారట. 

జగన్ చేయించిన సర్వేల నివేదిక ఆధారంగా నియోజకవర్గాల వారీ నివేదికలను రూపొందించి వాటిని పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు అందజేశారు జగన్. అంతేకాదు ఆ నివేదికలో ఇంచార్జ్ తీసుకోవాల్సిన అంశాలను పొందుపరుస్తూ దిశానిర్దేశం చేశారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలవారీ పార్టీ పరిస్థితి, నాయకుల స్థితిగతులతోపాటు ఆయా సామాజికవర్గాల వారీ పార్టీకి, ప్రత్యర్థి పక్షాలకు ఉన్న సానుకూలతను కూడా తెలియజేశారు.
 
ఈ ఎన్నికను ఆయా సామాజిక వర్గాలు ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీ ఏ సామాజికవర్గం వైసీపీని ఆదరిస్తోంది... ఏ సామాజికవర్గం  ఓటర్లను పార్టీ ఆకర్షించలేకపోతుంది వాంటి అంశాలపై కూడా నివేదికలో ఇచ్చారు. 

గత ఎన్నికల్లో తన సొంత మీడియా సర్వేలపై ఆధారపడి ఇబ్బందిపడ్డ జగన్ ఈసారి మాత్రం అలా జరగకూడదనే ఉద్దేశంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను బరిలోకి దింపారు. ప్రశాంత్‌ కిషోర్‌ బృందం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తోంది.  

అటు ప్రశాంత్ కిషోర్ టీంతోపాటు తన సొంత మీడియా సంస్థతోనూ, ప్రైవేట్ సంస్థలతోనూ సర్వే చేయించారు. ఈ మూడు నివేదికలను బేరీజు వేసుకుని నియోజకవర్గాల వారీగా నివేదికలు తయారు చేసి ఆయా ఇంచార్జ్ లకు అందజేశారు. 
 
ఇకపోతే ఈ సర్వేలలో జగన్ మూడు అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. నియోజకవర్గాలలో వైసీపీ పరిస్థితి, అక్కడున్న పార్టీ ఎమ్మెల్యే లేదా సమన్వయకర్త పనితీరు, అధికార పార్టీ నాయకుడి పరిస్థితి ఉలా ఉంది అన్న అంశాలపై ప్రధానంగా సర్వే చేయించారు. 

అంతేకాదు ఆయా సామాజికవర్గాల ఓటర్లలో ఎవరికి పట్టు ఉంది, ఎవరు ఓటర్లను ఆకర్షిస్తారు వంటి విషయాలపైనా జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. అందుకు తగ్గట్లుగా నియోజకవర్గాల్లో ఐదు సామాజికవర్గాలను ఎంపిక చేసుకుని వాటిలో వైసీపీ, టీడీపీ, జనసేన పరిస్థితి ఎలా ఉందన్న అంశాలను పసిగట్టారు.
   
ప్రకాశం జిల్లాలో సర్వేపై బయట చర్చ జరుగుతోంది. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఏడెనిమిది సామాజికవర్గాలను పరిగణలోకి తీసుకుని సర్వే చేసినట్లు తెలుస్తోంది. 

అగ్రవర్ణాల్లో రెడ్డి, కమ్మ, కాపు, వైశ్యులను, దళితుల్లో మాల, మాదిగ వర్గాలను ఆయా నియోజకవర్గాలను బట్టి వేర్వేరుగా, బీసీల్లో యాదవ సామాజికవర్గానికి, ముస్లిం మైనారిటీ వర్గాల్లో వైసీపీ పరిస్థితి ఏమిటి? ప్రత్యర్థి పక్షాలైన టీడీపీ, జనసేన పరిస్థితి ఏమిటి? అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. 

ఏ సామాజికవర్గం ఓటర్లు అధికంగా ఉన్న ఆ నియోజకవర్గాల్లో వారి మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అలాగే వేరే చోట ప్రభావితం చేసే సామాజిక వర్గంపై ఆరా తీశారు.  

ప్రకాశం జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమ్మ, రెడ్డి, దళితుల్లో మాల, మాదిగ, బీసీలు అందులో ప్రధానంగా యాదవ, ముస్లిం మైనారిటీలు, వైశ్య, ఒకట్రెండు చోట్ల మత్స్యకారులు, చేనేతల మనోగతాలకు ఆ నివేదికల్లో ప్రాధాన్యం ఇచ్చారు. 

మూడు, నాలుగు నియోజకవర్గాల్లో కమ్మ సామాజికవర్గాన్ని పక్కనపెట్టి అక్కడ పరిస్థితులకు అనుగుణంగా సామాజికవర్గాలను ఎంపిక చేసుకున్నారు. మార్కాపురం, గిద్దలూరు వంటి చోట్ల అగ్రవర్ణాల్లో రెడ్డి, కాపు, ముస్లిం మైనారిటీలు, దళితుల్లో మాదిగలు, బీసీల్లో యాదవులకు ప్రాధాన్యం ఇచ్చి వారి నుంచి వైసీపీ, టీడీపీ, జనసేన, ఇతర బలమైన అభ్యర్థుల బలాబలాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. 
 
సర్వే నివేదికలను ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు ఇచ్చిన జగన్‌ పలు సూచనలు, హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. ఒక సామాజిక వర్గానికి చెందిన నేతకు ఆ సామాజిక వర్గంలో మంచి ఆదరణ ఉండి ఇతర సామాజిక వర్గంలో లేకపోతే అలాంటివి సరి చేసుకోవాలని సూచించారు. 

పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండపి నియోజకవర్గాల్లో అగ్రవర్ణాల్లో ఒక సామాజిక వర్గంలో ఆదరణ మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని సమన్వయ కర్తలకు సూచించారు జగన్. 
 
జిల్లాలోని అన్ని నియోజకవర్గాలపై టార్గెట్ పెట్టలేకపోతే రెండు మూడు నియోజకవర్గాలను పక్కన పెట్టి మిగిలిన వాటిపై ఫోకస్ పెట్టాలని జగన్ సూచించారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక సమస్యలను సవరించుకొంటే తిరిగి అత్యధిక స్థానాల్లో వైసీపీదే గెలుపు అని జగన్‌ చెప్పినట్లు తెలుస్తోంది. 

లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా పరిగణలోకి తీసుకుని అందుకు తగ్గట్లుగా పార్టీ కమిటీలను ఏర్పాటు చేసింది వైసీపీ. తాము అధికారంలోకి వస్తే లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తూ 25 జిల్లాలను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. 

అందులో భాగంగానే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా విడి విడిగా ఈ సర్వేలపై పార్టీ శాసనసభ్యులు, సమన్వయకర్తలతో జగన్‌ మాట్లాడారు. ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్ తోపాటు, కొండపి, కనిగిరి, ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో జగన్ మాట్లాడారని సమాచారం. 
 
అలాగే బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ సమావేశంలో చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు సమన్వయకర్తలను జగన్ ఆహ్వానించారు. వారికి జగన్‌ సర్వే నివేదికలను అందజేసి లోపాలపై పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.  

ఈ రెండు సమావేశాల్లో చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో సమన్వయ కర్తల పనితీరుపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు దొరికితే రంగంలోకి దించుతామని నిర్మోహమాటంగా జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios