హైదరాబాద్: విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో కత్తి దాడికి గురైన వైఎస్ జగన్ ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రికి తరలించారు. విశాఖపట్నంలో హైదరబాద్ బయలు దేరేందుకు ఎయిర్ పోర్ట్ లోని వీఐపీ డిపార్చర్ లాంజ్ లో వెయిట్ చేస్తున్న వైఎస్ జగన్ ను శ్రీనివాసరావు అనే వెయిటర్ కత్తితో దాడి చేశాడు. దీంతో స్వల్ప గాయాలపాలైన జగన్ ఎయిర్ పోర్ట్ లోని వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అక్కడ నుంచి జగన్ విమానంలో హైదరాబాద్ బయలు దేరారు. 

హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్ ను ఎయిర్ పోర్ట్ లోనే వైద్యుల సిబ్బంది పరీక్షించారు. అనంతరం ప్రత్యేక అంబులెన్స్ లో సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్ లో వైఎస్ జగన్ తోపాటు ఆయన సతీమణి వైఎస్ భారతి ఉన్నారు. 

అయితే కత్తిదాడి నేపథ్యంలో కత్తికి విషం పూసారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో జగన్ సతీమణి  వైఎస్ భారతి అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రత్యేక అంబులెన్స్ లో జగన్ ను న్యూరో సెంటర్ ఆస్పత్రికి తరలించారు.