Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబే రైలును తగులబెట్టించారు: వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణ

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం తునిలో జరిగిన బహిరంగ సభలో జగన్ టీడీపీ ప్రభుత్వంపై జగన్ నిప్పులు చెరిగారు. తుని తాండవ నదిలో స్పూన్‌ ఇసుక లేకుండా తోడేశారని ధ్వజమెత్తారు.

YS Jagan accuses Chandrababu for Tuni rail accident
Author
Tuni, First Published Aug 11, 2018, 7:50 PM IST

కాకినాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కుట్రపూరితంగా తునిలో రైలును తగలబెట్టించారని వైయెస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్ ఆరోపించారు. కాపు రిజర్వేషన్ ఉద్యమ సమయంలో తునిలో రైలును దగ్ధం చేసిన విషయం తెలిసిందే. దాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబుపై జగన్ ఆ ఆరోపణ చేశారు.

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం తునిలో జరిగిన బహిరంగ సభలో జగన్ టీడీపీ ప్రభుత్వంపై జగన్ నిప్పులు చెరిగారు. తుని తాండవ నదిలో స్పూన్‌ ఇసుక లేకుండా తోడేశారని ధ్వజమెత్తారు. కాపు ఉద్యమ సమయంలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆ కేసులన్నీ ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లుగా మార్చేస్తామని జగన్ ప్రకటించారు.

చంద్రబాబు నాయుడు పాలనంతా అవినీతిమయమని, ఇసుక, మట్టి, గుడి భూములు సహా దేన్నీ వదలడం లేదని ఆయన ధ్వజమెత్తారు. మఠానికి చెందిన 425 ఎకరాల భూమిని కాజేసేందుకు చూసిన చంద్రబాబు, దేవుడి భూములను బ్యాంకుల్లో తాకట్టు పెడుతున్నారని అన్నారు. చంద్రబాబు బినామీ కంపెనీ దివీస్‌ అని పేర్కొన్న వైఎస్‌ జగన్‌, దివీస్‌కు భూములు ఇవ్వలేదని రైతులపై కేసులు బనాయిస్తున్నారని అన్నారు.

విశాఖలో ఫార్మా కంపెనీ వచ్చి ఉంటే అందరం సంతోషించేవాళ్లమని, కానీ అతిపెద్ద హాచరిస్‌ ఉన్న తుని నియోజకవర్గంలోని ప్రాంతంలో ఇలాంటి కంపెనీలా అని ఆయన అన్నారు. కేంద్రం కూడా ఈ ప్రాంతాన్ని ఆక్వా జోన్‌గా ప్రకటించిందనే విషయాన్ని గుర్తు చేశారు. 

ఇదే తుని నియోజకవర్గంలో కాపుల రిజర్వేషన్లకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతిచ్చిందని, దానివల్ల ఏం జరిగిందంటే 75 శాతం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కేసుల్లో ఇరికించారని, ఎస్సీలు, బీసీలు, ఆడపడచులు, చివరికి వికలాంగులపై కూడా కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

చెత్త వేయడానికి తునిలో డంపింగ్‌ యార్డ్‌ కూడా లేదని, శ్మశానాలలో చెత్త వేయాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. కేవలం తుని నియోజకవర్గంలోనే ఇన్ని సమస్యలుంటే.. రాష్ట్రం మొత్తం ఇంకా ఎన్ని సమస్యలున్నాయో అని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios