అమరావతి: తెలుగుదేశం పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీఐఐసీ చైర్మన్, ఎమ్మెల్యే రోజా. తెలుగుదేశం పార్టీ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. మహిళలపై అనేక దారుణాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. 

చంద్రబాబు ప్రభుత్వంలో విద్యార్థినులపై అఘయిత్యాలు చోటు చేసుకున్నాయని మహిళలపై మానభంగాలు జరిగాయని, నడిరోడ్డుపై మహిళలను వివస్త్రను చేశారని ఆరోపించారు. ఇన్ని జరుగుతున్నా ఆనాడు మహిళా కమిషన్ నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించిందని ఆరోపించారు. 

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ గా నియమితులైన వాసిరెడ్డి పద్మ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన రోజా వాసిరెడ్డి పద్మ మహిళల సమస్యలపై పోరాటం చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. వాసిరెడ్డి పద్మ నియామకం ఆ పదవికే వన్నెతెచ్చినట్లైందన్నారు. 

చంద్రబాబు ప్రభుత్వంలో మహిళా ఎమ్మెల్యే అయినా తానే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. మహిళల రక్షణ కోసం తాను అసెంబ్లీలో పోరాడుతుంటే తనపై అకారణంగా, చట్టానికి విరుద్ధంగా ఏడాదిపాటు సస్పెండ్ చేసిన ఘనత కోడెల శివప్రసాదరావుకే దక్కుతుందని విమర్శించారు. 

కారు షెడ్డులో ఉండాలి, ఆడది వంటింట్లో ఉండాలంటూ చేసిన వ్యక్తి స్పీకర్ గా ఉండటం మన దౌర్భాగ్యమన్నారు. చంద్రబాబు అయితే మహిళల పుట్టుకనే నిందిస్తాడని మండిపడ్డారు. కోడలు మగపిల్లాడును కంటానంటే అత్త వద్దంటుందా అంటూ హీనంగా మాట్లాడారని ఆరోపించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ పేరుతో మహిళలను వ్యభిచార కూపంలోకి నెట్టిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కాపాడారని విమర్శించారు. 

వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలంతా సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. టికెట్లు కేటాయింపులు దగ్గర నుంచి పదవుల కేటాయింపు వరకు మహిళలకు సీఎం జగన్ ప్రత్యేక స్థానం ఇచ్చారని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు.