సెల్ఫీ పిచ్చితో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వీధిలో పాములు ఆడించే వ్యక్తి దగ్గర పాము తీసుకొని మెడలో వేసుకొని సెల్ఫీకి ఫోజు ఇచ్చాడు. అది కాటు వేయడంతో ప్రాణాలు వదిలాడు. ఈ దారుణం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సూళ్లూరుపేట జీఎన్‌టీ రోడ్డులో దర్గా ఎదురుగా ఓ పాములోడు బుట్టలో నాగు పామును పెట్టుకొని ఆడిస్తున్నాడు. పాముకాటుకు తన వద్ద చెక్కలు ఉన్నాయని, అది కరిస్తే ఈ చక్కలు తింటే విషం విరుగుడు అవుతుందని నమ్మిస్తూ విక్రయిస్తున్నాడు. ఇంతలో మండలంలోని మంగళంపాడుకు చెందిన చిట్టేటి జగదీష్‌ (24) అత్యుత్చాహం చూపి పామును మెడలో వేసుకుంటానని కోరాడు.
 
పాములోడు ఆ పామును అతని మెడలో వేయగా ఫోజులిచ్చాడు. ఇంతలో ఆ పాము అతని చేతిపై కాటు వేసింది. పాము కరచినా ఏమీ కాదంటూ ఆ పాములోడు చెబుతుండగానే అతని నోటి నుంచి నురగరావడం ప్రారంభమైంది. వెంటనే పాములోడు పాముతో సహా పరారయ్యాడు. చుట్టుపక్కలవారు అతనిని సమీపంలోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పాముకాటు విరుగుడు ఇంజక్షన్‌ తమ వద్ద లేదనడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి వేరే ఆస్పత్రికి తరలిస్తుండగా అతను మృతిచెందాడు.