పెట్రోలు పోసుకున్న బాధితుడు....చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

First Published 28, Dec 2017, 10:09 AM IST
Youth poured petrol him self to set fire as protest
Highlights
  • చంద్రబాబునాయుడు ఇంటి ముందే పెట్రోలు పోసుకుని ఓ బాధితుడు ఆత్మహత్యకు ప్రయత్నించటం సంచలనంగా మారింది.

చంద్రబాబునాయుడు ఇంటి ముందే పెట్రోలు పోసుకుని ఓ బాధితుడు ఆత్మహత్యకు ప్రయత్నించటం సంచలనంగా మారింది. దాంతో చంద్రబాబు ఇంటి పరిసర ప్రాంతాలన్నీ పోలీసులతో నిండిపోయింది. ఇంతకీ ఏమి జరిగిందంటే, ఇబ్రహింపట్నం పట్నం వద్ద కొందరు ఇళ్ళను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది మూడేళ్ళ క్రితం. రోడ్ల అభివృద్ధి కోసం ఇళ్ళను తీసుకుంటున్నమని చెప్పిన ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఇంటి స్ధలాలు ఇస్తామని హామీ ఇచ్చింది. నష్టపరిహారం కూడా ఇస్తామని దాంతో బాధితులు వేరే చోట ఇళ్ళు కట్టుకోవచ్చమంటూ హామీ ఇచ్చారు.

ఇదంతా ఎప్పుడు జరిగిందంటే, మూడేళ్ళ క్రితం. అప్పట్లో మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు హామీని నమ్మి తమ ఇళ్ళను అప్పగించారు. అయితే, సంవత్సరాలు గడుస్తున్నా హామీ హామీగానే మిగిలిపోయింది. అధికారులు ఇళ్ళను స్వాధీనం చేసుకుని కూల్చేసారు కూడా. నష్టపరిహారం, ప్రత్యామ్నాయ స్ధలాల కోసం బాధితులు ఎంతగా తిరుగుతున్నా మంత్రి పట్టించుకోవటం లేదు. ముఖ్యమంత్రికి చెబుదామనుకుంటే అవకాశం రాలేదు. దాంతో విసిగిపోయిన బాధితులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు.

బుధవారం ఆందోళన పరాకాష్టకు చేరుకుని సిఎం ఇంటి ముదు పెట్రోలు, కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడో బాధితుడు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. పరిస్ధితిని గమినించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై బాధితుడి వద్ద నుండి కిరోసిన్, పెట్రోలు సీసాలను లాగేసుకున్నారు. దాంతో మిగిలిన బాధితులు కూడా తమ చేతుల్లో పెట్రోలు, కిరోసిన్ సీసాలను పట్టుకుని నష్ట పరిహారం ఇవ్వకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమంటూ ఆందోళన చేస్తున్నారు.

loader