ఓ యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. ఆమెతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. విషయం తెలుకున్న యువతి తల్లిదండ్రులు ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి చేశారు. అయినా వీరిలో మార్పు రాలేదు. పెళ్లి జరిగినా కూడా ఈ యువతీయువకులు తమ అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. చివరకు.. ఆ యువతి కుటుంబీకుల చేతిలో యువకుడు హతమయ్యాడు. ఈ దారుణ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... భీమవరం సమీపంలోగల మైప గ్రామానికి చెందిన శీలం రఘుబాబు (24) మండపాక గ్రామానికి చెందిన మేనమామ జంగం శేఖర్‌ వద్ద ఉంటూ ఒక ప్రైవేటు కర్మాగారంలో కాంట్రాక్ట్‌ కార్మికుడిగా పనిచేసేవాడు. ఇదిలా ఉండగా రఘుబాబుకు అదే గ్రామానికి చెందిన యువతితో సంబంధం ఉంది. దీంతో... ఆ యువతికి పెళ్లి చేశారు. అయినా.. ఆరేళ్లుగా వీళ్ల అక్రమ సంబంధం కొనసాగుతూనే ఉంది. ఈ విషయం తెలిసిన యువతి భర్త ఆమెను వదిలేశాడు.

కాగా.. తన చెల్లెలి జీవితం ఇలా కావడానికి కారణం రఘుబాబేనని అతనిపై యువతి సోదరుడు మణికంఠ పగ పెంచుకున్నాడు. పథకం ప్రకారం ఈ నెల 8వ తేదీన అతనిని హతమార్చారు. అనంతరం ఆటోలో వేరే ప్రాంతానికి తీసుకువెళ్లి శవాన్ని తగలపెట్టారు. గుర్తుతెలియని కాలిపోయిన శవాన్ని గమనించిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రఘుబాబు కనపడటం లేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రఘుబాబు ధరించిన చెప్పులు ఆధారంగా అతనిని కుటుంబసభ్యులు గుర్తించారు. అనంతరం వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమ దర్యాప్తులో వివాహేతర సంబంధమే కారణమని తెలుసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.