తన కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారని.. కానీ తాను మాత్రం చదవలేకపోతున్నానని ఓ యువకుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తల్లిదండ్రులు ఆశించిన స్థాయికి తాను ఎదగలేననే బాధతో సదరు యువకుడు కనిపించకుండా పోవడం గమనార్హం. ఇదే విషయాన్ని తన సోదరుడికి మెసేజ్ ద్వారా తెలియజేసి కనిపించకుండా పోయాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా పాయకరావుపేట మండలం రత్నాయంపేటలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తూర్పుగోదావరి జిల్లా తునిలోని గురువు వీధికి చెందిన కె. మోహిత్ కుమార్(20) రాజమహేంద్ర వరం సమీపంలోని రాజానగరంలోని జీఎస్ఎల్ మెడికల్ కళాశాలలో ఫిజియోథెరపీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీ నుంచి బైక్ పై శనివారం రాత్రి తుని వచ్చాడు. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలియదు. ఇంట్లోవారికి తెలీకుండా గ్రిల్స్ లోని బ్యాగు, తన ఇతర వస్తువులు లోపల వేశాడు.

ఆ తర్వాత ద్విచక్రవాహనం తీసుకొని బయటకు వెళ్లాడు. అర్థరాత్రి దాటిన తర్వాత అతని సోదరుడు ఆదర్శ్ కి మెసేజ్ చేశారు. తాను తల్లిదండ్రులు ఆశించినంతగా చదవడం లేదని.. తన బైక్ పాల్మన్ పేట తీర ప్రాంతంలో ఉంచానని అందులో పేర్కొన్నాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు తీర ప్రాంతానికి చేరుకున్నారు.

రత్నాయంపేట సముద్రపు ఒడ్డున ఉన్న జెట్టీ పక్కన బైక్ గుర్తించారు. యువకుడి ఆచూకీ కానరాలేదు. చుట్టుపక్కల మొత్తం గాలించగా.. ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. యువకుడి ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు.